భారతీయ జనతా పార్టీ పునాదులన్నీ.. అయోధ్య రామ మందిర నిర్మాణంపైనే ఉన్నాయి. ఆ పార్టీ రెండు సీట్ల నుంచి ప్రస్థానం ప్రారంభించి… 282 సీట్లకు ఎదిగింది కానీ.. ఇంత వరకూ.. రాముడి గుడి పునాదులు మాత్రం.. పడలేదు. సంపూర్ణ మెజార్టీతో.. అటు కేంద్రంలో.. ఇటు రాముడి గుడి కట్టాల్సిన యూపీలో.. తిరుగులేని అధికారం చెలాయిస్తూ… కూడా… ఏమీ చేయలేకపోయిన బీజేపీ నేతలు.. మళ్లీ.. రాముడి గుడి అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడా క్లారిటీ ఇవ్వలేదు. రాజ్యాంగ విధివిధానాలకు లోబడి త్వరలోనే అన్ని వర్గాల ఆమోదంతో రామ మందిర నిర్మాణం చేస్తామన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను ఢిల్లీలో “సంకల్ప పత్ర” పేరుతో విడుదల చేశారు.
130 కోట్ల మంది భారతీయుల కోరికలు, ఆకాంక్షలను సాకారం చేసేలా విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. రైతులు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తేలడంతో… ఆ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు వరాలు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీతో రుణం ఇస్తామని చెప్పుకొచ్చారు. 60ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు పెన్షన్, కిసాన్ సమ్మన్ నిధి కింద రైతులకు ఏటా రూ. 6000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పుకొచ్చారు. దీన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి రూ. 25లక్షల కోట్ల కేటాయిస్తామని ఘనంగా ప్రకటించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. కచ్చితంగా.. ఇదే హామీ గత ఎన్నికల్లో ఇచ్చారు. కానీ.. రైతుల ఆదాయం తగ్గిపోయిందని.. రికార్డులు చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో…పేదలకు కనీస ఆదాయ పథకం… బాగా హైలెట్ అయింది. ఉత్తరాది రాష్ట్రాల ప్రజల్లోకి ఇది బాగా వెళ్లింది. దీనికి బదులుగా ఓ పథకాన్ని ప్రవేశ పెట్టాలని బీజేపీ నేతలు ఆలోచించారు. చివరికి.. రైతులకు పెన్షన్ పథకం పెట్టారు. దీని విధావిధానాలపై క్లారిటీలేదు. హామీలు మాత్రం ఘనంగా ప్రకటించారు. మొత్తానికి కాంగ్రెస్ మేనిఫెస్టోపై… ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్న సమయంలో.. దానిని ఢీకొట్టేలా.. బీజేపీ… తన మేనిఫెస్టోను ఆకర్షణీయంగా రూపొందించలేకపోయింది. గత ఎన్నికల సమయంలో.. బ్లాక్‌మనీని తెచ్చి అకౌంట్లలో రూ. పదిహేను లక్షలేస్తామన్న హామీ ఇప్పటికీ.. ప్రజలు గుర్తు చేస్తూండటంతో… అలాంటి హామీల జోలికి.. బీజేపీ వెళ్లలేదని తెలుస్తోంది.