భారతదేశ భావి ప్రధాని చంద్రబాబునాయుడేనని… జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసేందుకు ఆయన… వయోభారాన్ని లెక్క చేయకుండా… ఒక రోజు సమయం కేటాయించారు. ఈ ఉదయం అమరావతి వచ్చిన ఆయన… చంద్రబాబుతో కలిసి కృష్ణా జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు. తిరువూరు సభలో మాట్లాడిన దేవేగౌడ.. ప్రదాని మోడీ తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారని.. మండి పడ్డారు. మోడీ.. చంద్రబాబు పోరాటం.. అద్భుతంగా చేస్తున్నారని.. ఆయన భావి భారత ప్రధాని అని జోస్యం చెప్పారు. దేవేగౌడ వ్యాఖ్యలతో…తిరువూరు సభకు హాజరైన ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
దేవేగౌడ ప్రధాని అయినప్పుడు.. చంద్రబాబు… జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు.. చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నారు. అన్ని పార్టీలు చంద్రబాబునే… ప్రధాని పదవి చేపట్టాలని కోరాయి. కానీ చంద్రబాబు మాత్రం… అంగీకరించలేదు. కర్ణాటక దేవేగౌడ పేరును ప్రతిపాదించారు. దానికి అన్ని పార్టీల నేతలు అంగీకరించడంతో ఆయన ప్రధాని అయ్యారు. ఆ విషయాలను సందర్భం వచ్చినప్పుడల్లా దేవేగౌడ గుర్తు చేసుకుంటూ ఉంటారు.
ప్రస్తుత దేశ రాజకీయాలు క్లిష్టంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల తర్వాత ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కూటమికి ఏదో ఓ జాతీయ పార్టీ మద్దతివ్వాల్సి ఉంటుంది. లేకపోతే.. ప్రాంతీయ పార్టీలే ఏదో జాతీయ పార్టీకి మద్దతివ్వాల్సి రావొచ్చు. ఓ రకంగా.. జాతీయ పరిణామాలు కీలకంగా మారబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ కూటమిలో ఉన్న దేవేగౌడ వ్యాఖ్యలు కలకలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.