తెలంగాణ ప్రజలను సెంటిమెంట్ పేరుతో రెచ్చగొట్టొచ్చు, వారి భావోద్వేగాలను ఒడిసిపడితే చాలు.. అదే గెలుపు అని మాత్రమే సీఎం కేసీఆర్ భావించినట్టున్నారు. అదే స్ట్రాటజీతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆంధ్రుల పాలన మనకి అవసరమా అన్నారు. తెలంగాణ పాలన విజయవాడకి వెళ్లిపోతుందని భయపెట్టారు. చెంచాగిరీ మనం చెయ్యమన్నారు. ఇవన్నీ ఏరుదాటక ముందు చెప్పినవి. ఇవాళ్ల, తెప్ప తగలేస్తూ… ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే మాకేం ఇబ్బందిలేదని ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టుకీ సాయం చేస్తారట. నీళ్లు సముద్రం పాలయ్యే కంటే, ఆంధ్రులు వాడుకుంటే మంచిదే కదా అన్నారు. ఆహా… ఆంధ్రుల చెవుల్లో తేనె పోసే ప్రయత్నాలివి. మరి, ఈ ప్రకటనలు విన్నాక.. సగటు తెలంగాణ వ్యక్తి, కేసీఆర్ మాటలు నమ్మి గత ఎన్నికల్లో ఓటేసిన ఓటరు ఏమనుకుంటాడు..?
ఆంధ్రాకి ప్రత్యేక హోదా వస్తే మనకు విఘాతం అంటూ కేసీఆర్ చేసిన ప్రకటనల్ని తెలంగాణ ప్రజలు చాలా బలంగా నమ్మారు. పరిశ్రమలకు నష్టదాయకం, మన పరిశ్రమలన్నీ ఆంధ్రాకి వెళ్లిపోతాయి, పెట్టుబడులు అక్కడికే వెళ్లిపోయే ప్రమాదం ఉంది… ఇవి సాక్షాత్తూ కేసీఆర్ స్వయంగా చెప్పిన మాటలే. తెలంగాణ ప్రజలకు దెబ్బతీసేలా ఏపీకి ప్రయోజనాలు కల్పిస్తే అడ్డుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైనవారనీ, ఈ అంశాలపై ప్రజల్లో తీవ్రంగా ప్రతీ ఒక్కరూ చర్చించాలన్నారు. ప్రజల స్థాయిని పెంచి ఆనాడు మాట్లాడారు.
ఈ మాటలు నమ్మే కదా కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు మరోసారి గెలిపించారు. ఆంధ్రాకి హోదా వస్తే.. తెలంగాణకు చెందింది ఏదో తీసుకెళ్లిపోతారన్న భయం ఆవహించే, కేసీఆర్ అయితే అడ్డుపడతారని ఎన్నుకున్నారు. కానీ, ఇవాళ్ల కేసీఆర్ చేసింది ఏంటి..? ఏపీ హోదాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు ఎలా తీసుకోవాలి..? కేసీఆర్ మాట మార్చినట్టు కాదా..? తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నట్టేట ముంచినట్టు కాదా..? అంటే, తెలంగాణ ప్రజలకు తానేం చెప్పినా నమ్ముతారన్న ధీమాతో ఇలా ప్రకటించారా..? ఆంధ్రోళ్ల నీడలు పడితేనే ఏదో కొంపలు మునిగిపోతాయని అసెంబ్లీ ఎన్నికల్లో గర్జించిన కేసీఆర్, ఇప్పుడు ఆంధ్రాలో ఒక పార్టీ గెలవడం కోసం తెలంగాణలో ప్రజల ముందు తాను చేసిన ప్రకటనల్నే మార్చేస్తున్న వైనాన్ని సగటు తెలంగాణ వ్యక్తి ఎలా భావిస్తాడు..? దీనిపై తెలంగాణలో చర్చ జరగొద్దా..?