గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్‌కార్పొరేషన్‌కు సంబంధించి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మూడురోజుల్లో ఫలితాలు వచ్చేస్తాయి. కొత్త మేయర్ ఎవరు అవుతారో తేలిపోతుంది. రాష్ట్రంలో కీలకమైన రాజధాన నగర పాలిక ఎన్నికల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేస్తున్నట్లే. ఇంతవరకూ వచ్చిన తర్వాత.. వామపక్షాల నేతలు ఇప్పుడు ఏకంగా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టంలోనే మార్పుచేర్పులు కోరుకుంటున్నారు. మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు వేసే అవకాశం కల్పించకూడదంటూ సీపీఐకు చెందిన నారాయణ, చాడ వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రత్యేకంగా ఒక లేఖాస్త్రాన్ని సంధంచడం ఈ సందర్భంగా గమనార్హం.
కామెడీ ఏంటంటే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించిన విధివిధానాలు నోటిఫికేషన్ విడుదలైన కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రకటితమయ్యాయి. మేయర్ ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఓటు వేస్తారంటూ చాలా స్పష్టంగా విధివిధానాల్లో పేర్కొన్నారు. విధివిధానాలు వచ్చిన తర్వాత ఇన్ని రోజులూ నింపాదిగా నోరు మెదపకుండా కూర్చుని.. తీరాపోలింగ్ దశ వచ్చిన తర్వాత.. ఇప్పుడు అసలు నిబంధనల్నే మార్చాలంటూ కోరడంలో విజ్ఞత ఏపాటి ఉన్నదో ఈ వామపక్ష నాయకులే ఆలోచించాలి.
వారు దీన్నేదో రాజకీయ చేసి.. మేయర్ పీఠం దక్కించుకోవడానికి కేసీఆర్ చేస్తున్న కుట్రగా అభివర్ణించడానికి ప్రయత్నిస్తున్నారు. మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచిన వారుమాత్రమే ఓటు వేయాలని, కానీ కేసీఆర్ మాత్రం ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఓటు వేస్తారని చెబుతున్నారని అంటున్నారు. ఇది ఈ ఎన్నికలకు సంబంధించిన నిబంధనగా నిర్దేశించారే తప్ప.. కేసీఆర్ చెబుతున్న మాటగా ఆపాదించడం కరెక్టు కాదు.
రేప్పొద్దున్న మేయర్ పీఠం తెరాసకు దక్కితే ‘మేం ముందే చెప్పాం.. ఆ ఎన్నికల సిస్టంలోనే లోపాలున్నాయి. వాళ్లు కుట్ర చేసి గెలిచారు’ అంటూ అరచి గీ పెట్టడానికి తప్ప మరెందుకూ ఈ లేఖాస్త్రం వారికి ఉపయోగపడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.