48 గంటల్లో 12 సార్లు కర్ణాటక సీఎం కుమారస్వామితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి..!
కారణాలు లేకపోయినా… ఆరోపణలు లేకపోయినా… ఏపీలో టీడీపీ నేతలపై వరుస ఐటీ దాడులు జరిగాయి..!
నిన్నామొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన … మధ్యప్రదేశ్‌లో.. అక్కడి ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సన్నిహిత వర్గాలపై… ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు..!
ఈ ఐటీ దాడుల పరంపర ఇలా సాగుతూనే ఉంది. అన్నీ… బీజేపీని వ్యతిరేకించే పార్టీలపైనే. ఒక్కటంటే.. ఒక్క చోట కూడా.. బీజేపీ… దాని అనుబంధ.. రహస్యానుబంధ పార్టీలపై దాడులు జరగలేదు. ఇలా జరుగుతున్న సమయంలోనే.. బీజేపీ విచ్చలవిడిగా.. డబ్బులు ఖర్చు చేస్తోంది. ఎంతగా అంటే.. ఒక్క లోక్‌సభ స్థానంలో మాత్రమే పంచడానికి ఏకంగా బ్యాంక్ నుంచే.. రూ. 8 కోట్లు డ్రా చేసి తీసుకెళ్తూ పట్టుబడ్డారు. బయటకు తెలిసింది కాబట్టి.. రచ్చ అయింది.. లేకపోతే.. పంపకానికి వెళ్లిపోయేదే. ఇక దేశంలో.. ఎన్ని వేల కోట్లు.. ఇలా ఖర్చు చేస్తున్నారో మరి..! అయినా.. ఏ ఒక్క బీజేపీ నేతపైనా.. ఐటీ దాడులు జరగవు.
మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ, భోపాల్, ఇండోర్, ఇంకా ఇతర ప్రాంతాల్లో 50 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. కమల్‌నాథ్‌కు ఓఎస్డీ ప్రవీణ్ కక్కడ్, ఆయన మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ ఇళ్లు, కార్యాలయాలతో పాటు కమల్‌నాథ్ బావమరిదికి చెందిన మోసర్ బేయర్ కంపెనీలో పనిచేసే అధికారుల ఇళ్లు, ఆయన మేనల్లుడు రతుల్ పురి కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 300 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించేందుకు ప్రయత్నించిన ఐటీ అధికారులు మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డుకోవడంతో హైడ్రామా చోటు చేసుకుంది.
ప్రవీణ్ కక్కడ్ సన్నిహితుడైన అశ్విన శర్మ నివాసంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు ప్రయత్నించడంతో వారికి పోలీసులు అడ్డుతగిలారు. నివాస ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్ సిబ్బంది చుట్టుముట్టడంతో స్థానికుల ఫిర్యాదు మేరకే తాము రంగంలోకి దిగినట్లు పోలీసులు చెప్పుకున్నారు. పన్ను ఎగవేతతో పాటు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో హవాలా డబ్బు అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఉప్పందడంతో దాడులు జరిపామని ఐటీ అధికారులు చెబుతున్నారు. కానీ… బీజేపీ వ్యతిరేకుల్నే టార్గెట్ చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ దాడులు చేసే సమయంలో… రూ. వందల కోట్లు దొరికాయన్నట్లుగా.. మీడియాకు లీకులు ఇస్తారు. చేయాల్సినంత దుష్ప్రచారం చేస్తారు. కానీ.. చివరికి … ఎంత స్వాధీనం చేసుకున్నారో కూడా బయట పెట్టరు. కేవలం.. రాజకీయ దురుద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నట్లు స్పష్టమవుతూనే ఉంటాయి. కానీ.. బీజేపీ నేతలు.. ముసుగులేసుకుని.. రాజకీయం చేస్తూనే ఉంటారు.