బ్రహ్మనందం వైభవం అంతా గతం. ఇది వరకు ఇంచుమించు ప్రతీ సినిమాలోనూ బ్రహ్మీ ఉండేవాడు. అడిగినంత పారితోషికం ఇచ్చిమరీ బ్రహ్మీ ని టీమ్ లోకి తీసుకునేవారు. బ్రహ్మీ కోసం సెపరేట్ ట్రాకులు రాసుకునేవారు,. సినిమా అంతటినీ తన భుజాలపై వేసుకుని నడిపించేవాడు. ఐతే ఆ రోజులు పోయాయి. నవతరం కమీడియన్ల ముందు బ్రహ్మీ జోరు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏడాదికి పది సినిమాల్లో కనిపించడం కూడా గగనం ఐపోతోంది. ఇప్పుడు బ్రహ్మీ పేరు చెపితే నిర్మాతలు, దర్శకులు భయపడిపోతున్నారు. బ్రహ్మీ ని భరించడం కష్టం అంటూ చేతులు ఎత్తేస్తున్నారు. బ్రహ్మీ చాప్టర్ దాదాపు క్లోజ్ ఐపోయింది. పైగా బ్రహ్మీ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. ఈ దశలో బ్రహ్మీ సినిమాల నుంచి శాశ్వతంగా రిటైర్ మెంట్ తీసుకుంటాడని భావించారు. ఐతే.. బ్రహ్మీ ఇప్పుడు రూటు మార్చాడు.
అనారోగ్యం నుంచి కోలుకున్న బ్రహ్మీ.. ఇకపై సినిమాలపై పూర్తిస్థాయిలో ద్రుష్టి పెట్టాలని ఫిక్స్ ఐపోయాడు. అందుకే తన పారితోషికం తగ్గించుకొవాలని నిర్ణయించుకున్నాడట. ఇది వరకు డబ్బుల కోసం చిన్న, చితకా సినిమాల్ని కూడా ఒప్పుకునేవాడు. ఇప్పుడు అలాంటి ప్రాధాన్యం లేని సినిమాలు మానేద్దాం అనుకుంటున్నాడట. పైగా తన కలల పాత్రలు కొన్ని వున్నాయి. అలాంటి పాత్ర పోషించే అవకాశం వస్తే పారితోషికం లేకుండా కూడా సినిమా చేస్తా అంటున్నాడట. మొత్తానికి బ్రహ్మీ కి పైసలపై యావ తగ్గినట్టే అనిపిస్తోంది. మరి ఈ త్యాగాలు దర్శక నిర్మాతలు గుర్తిస్తారో.. లేదో..