ఓట్లు మురిగిపోవడం – ఈ కాన్సెప్ట్ బహుశా ఇతర దేశాల్లో ఎక్కడా కనిపించక పోవచ్చు గానీ, భారతదేశంలో , మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఎన్నికల ఫలితాలను, రాష్ట్ర భవిష్యత్తును పలుమార్లు ఈ కాన్సెప్ట్ నిర్దేశిస్తోంది. ఇది ఎంతవరకు కు మంచి సంప్రదాయం, ఎంతవరకు ప్రజలకు మేలు చేసే సంప్రదాయం అనేది పరిశీలిద్దాం.
అసలు ఈ కాన్సెప్ట్ ఏ రకంగా పనిచేస్తుంది:
ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకు ఒక నాలుగు పార్టీలు ఎన్నికలలో బరిలో ఉన్నాయనుకుందాం, సర్వేల ఫలితాలను బట్టో, మీడియా వార్తలను బట్టో, లేదా సొంత అంచనాను బట్టో, ఓటరు ఏ పార్టీ గెలిచింది అన్న దానిమీద ఒక అంచనాకు వచ్చిన సమయంలో, గెలిచే పార్టీకి ఓటు వేయకపోతే తన ఓటు వేస్ట్ అయిపోతుంది అని అనుకొని, అందరూ ఏ పార్టీ అయితే గెలుస్తుంది అంటున్నారో ఆ పార్టీకి ఓటు వేయడం జరుగుతోంది. దీని వల్ల మిగతా పార్టీలతో పోలిస్తే కొంత శాతం ముందున్న పార్టీ, ఇటువంటి ఓటర్ల కారణంగా అది మరింత ఆధిక్యాన్ని సాధిస్తోంది.
దీనివల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఏంటి నష్టం?
2009లో లోక్సత్తా పార్టీని స్థాపించినప్పుడు, ఆ పార్టీ భావజాలం పట్ల చాలా మంది ఆకర్షితులయ్యారు. పారదర్శకత , నీతివంతమైన పాలన లాంటి అంశాలు ప్రజలను ప్రభావితం చేశాయి. కానీ ఆ పార్టీకి 2009 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కేవలం 1.8 శాతం. దీనికి కారణం, ఆ పార్టీ భావజాలం నచ్చిన వాళ్ళు కూడా చాలామంది “తన ఓటు మురిగి పోకూడదు” అనే ఉద్దేశంతో కాంగ్రెస్కు, తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు. దీంతో, ఎన్నికల ఫలితాలు వచ్చాక చాలా మంది ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ భవిష్యత్తు పట్ల విశ్వాసం కోల్పోయారు. ఒకవేళ ఆ పార్టీ భావజాలం పట్ల ఆకర్షితులైన వారందరూ తన ఓటు మురిగిపోతుందేమోనన్న ఆలోచన చేయకుండా ఆ పార్టీకి ఓటు వేసి ఉంటే, ఆ పార్టీకి మరొక రెండు మూడు శాతం ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటే, బహుశా లోక్ సత్తా పార్టీ బతికి ఉండే అవకాశం ఉండేది. నిజంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండే పార్టీలు బతికి ఉంటే రాష్ట్ర రాజకీయాలు మరొక రకంగా ఉండే అవకాశం ఉండేది.
మంచి అభ్యర్థి కి వేసిన ఓటు మురిగిపోవడం మంచిదా, గెలిచే అభ్యర్థి చేసే నేరాలలో భాగస్తులు కావడం మంచిదా?
తాను ఓటు వేసిన అభ్యర్థి గెలవకపోతే చాలా మంది ప్రజలు అదేదో పరాభవం లాగా భావిస్తారు. నిజానికి ఇది సరైన అభిప్రాయం కాదు. ఉదాహరణకు, ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థుల లో చింతమనేని , నేర చరిత్రకు సంబంధించిన అఫిడవిట్ ప్రకారం చూస్తే అనేక కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి. పైగా గత ఐదేళ్లలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, మహిళా అధికారుల పై దాడి చేయడం, దళితులను దూషించడం, జర్నలిస్టులను బెదిరించడం వంటి పలు సంఘటనలకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కొన్నింటికి వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలోని ఓటరు, తన ఓటు మురిగి పోకూడదు అన్న ఉద్దేశంతో , గెలిచే అవకాశం ఉందన్న అభిప్రాయం తో చింతమనేనికి గనక మళ్లీ ఓటు వేసినట్లయితే, అతను రాబోయే ఐదేళ్లలో తన గత చరిత్రను పునరావృతం చేస్తూ నేరాలు చేసినప్పుడు, తెలిసీ ఓటు వేసిన కారణంగా, ఆ నేరాలలోో – ఓటు వేసిన ఓటరు కూడా పాపం పంచుకోవాల్సి ఉంటుంది. చింతమనేని ని కేవలం ఉదాహరణగా తీసుకున్నాము తప్పిస్తే, ఈ లాజిక్ ఇతర పార్టీల్లో ఉన్న అన్ని అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ మంచి అభ్యర్థికి ఓటు వేసిి ఉంటే, ఆ అభ్యర్థి గెెెలవకపోయినప్పటికీీ, వ్యక్తిగతంగాాా గెలిచిన ఎమ్మెల్యే చేస్తున్నన నేరాలలో తాను భాగస్వామి కాకుండా ఉంటాడు.
మొత్తం మీద:
ఇప్పటికి ఓటర్లలో- డబ్బులు తీసుకుని ఓటు వేయడం, అభ్యర్థి కులాన్ని చూసి ఓటు వేయడం, మద్యానికి ఓట్లు అమ్ముకోవడం లాంటి అనేక అవలక్షణాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ఈ అవలక్షణాలను పూర్తిస్థాయిలో తొలగించాలంటే మంచి అభ్యర్థులు చట్టసభలలో ప్రవేశించాల్సిన అవసరం ఉంది. మంచి అభ్యర్థులకు వేసే ” మురిగిపోయే ఓట్లు” ఫలితాలను ఇప్పటికిప్పుడు మార్చ లేకపోయినప్పటికీ, ఎంత మంది ప్రజలు మంచి అభ్యర్థి సంఘీభావం తెలుపుతున్నారు అన్న విషయంలో సమాజానికి సందేశం ఇవ్వడం ద్వారా కాలక్రమేణా రాజకీయాలు మారే పరిస్థి తిని తీసుకురావడానికి దోహదం చేస్తాయి
– జురాన్ (@CriticZuran)