ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమౌతున్నారు. విధుల్లోకి అధికారులూ పోలీసులు బయలుదేరుతున్న ఈ సమయంలో కూడా బదిలీలు కొనసాగుతుండటం విశేషం. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కొన్ని గంటల్లో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ బదిలీ జరగడం చర్చనీయాంశం అవుతోంది.
వైకాపా నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎస్పీ పనిచేస్తున్నారనీ, ఆ పార్టీకి లబ్ధి చేసే విధంగా ఆయన చర్యలు ఉంటున్నాయనీ, ఆయన్ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తేగానీ పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తికాదంటూ వైకాపా ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ బదిలీ చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొత్త ఎస్పీగా సిద్ధార్థ్ కౌశిక్ ను నియమించారు. ప్రకాశం ఎస్పీతోపాటు గుంటూరు జిల్లాలో కూడా కొన్ని బదిలీలు చోటు చేసుకున్నాయి. మంగళగిరి, తాడేపల్లి, మదనపల్లి సీఐలను కూడా ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అధికార పార్టీకి అండగా ఉంటున్నారన్నదే బదిలీకి కారణమైన ఆరోపణలుగా తెలుస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో వైకాపా చేసిన ఫిర్యాదులకు స్పందించిన ఎన్నికల సంఘం ఇప్పటికే కొన్ని కీలక బదిలీలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ డీజీపీని కూడా బదిలీ చేయాలంటూ నిన్ననే మరోసారి ఎన్నికల సంఘానికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఒ.ఎస్.డి.లను కూడా మార్చాలంటూ కోరారు.