2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు 290 కంపెనీల బలగాలు వచ్చాయి. అలా వచ్చినా.. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సారి ఓటర్లు పెరిగారు. పోలింగ్ బూత్‌లు పెరిగాయి. కానీ వంద కంపెనీల బలగాలను మాత్రం తగ్గించారు. నక్సల్స్, ఫ్యాక్షన్ వివాదాలు ఉన్న నియోజకవర్గాలకు అదనపు బలగాలు కావాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి రాష్ట్ర డీజీపీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మొదటి దశలోనే ఎపీ పోలింగ్ ఉండటంతో వేరే రాష్ట్రాల నుంచి బలగాలను ఏపీకి తరలించాలని కోరినా.. ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. ఏపీలో ఈ సారి ఎన్నికలు… చాలా ఉద్రిక్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రచారం సమయంలోనే గొడవలు జరిగాయి. సమస్యాత్మక నియోజకకవర్గాలతో పాటు కొత్తగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.
తమ పార్టీకి మద్దతు పలకని వారిపై ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో నేతలు దౌర్జన్యాలకు దిగారు. మరి పోలింగ్ రోజు ఎలా వ్యవహరిస్తారు.. ఎలా విజృంభిస్తారన్నది ఇప్పుడు సమస్యగా మారింది. రాష్ట్రంలో ఎన్నికలు ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు 362 కంపెనీల పారామిలటరీ బలగాలు కావాలని కేంద్రానికి ఏపీ పోలీసులు లేఖ రాశారు. ఐతే కేవలం 197 కంపెనీల పారామిలిటరీ బలగాలు మాత్రమే రాష్ట్రానికి పంపారు. ఓ పార్టీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి., ఆ పార్టీ ఎక్కడెక్కడ.. బలగాలను మోహరించాలో చెబుతూ.. ఓ నివేదిక కూడా ఈసీకి ఇచ్చింది. దాని ప్రకారమే.. బలగాలను మోహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఓ పార్టీ నేతలు హైకోర్టులో నాలుగు రోజుల కింద పిటిషన్ వేశారు. సమస్యాత్మక కేంద్రాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్లో కోరారు. హైకోర్టు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్ట్ ఉత్తర్వుల ప్రకారం తాము సూచించిన సమస్యాత్మక కేంద్రాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఇది కూడా వారి పథకంలో భాగమేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.