దేశంలో ప్రజాస్వామ్యం మొత్తం ధనబలం ఆధారంగా గెలుపోటముల దిశగా మారుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న సోదాల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన రూ. 1862 కోట్లను అధికారులు పట్టుకున్నారు. మొత్తం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. ఇది మొదటి విడతకే పట్టుబడ్డాయి. ఇంకా భారీ మొత్తంలో నగదు పట్టుబడే అవకాశం ఉంది. వాహనాల తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 181 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని కూడా పట్టుకున్నారు. ఇక డ్రగ్స్, మాదకద్రవ్యాలు, గంజాయిని కూడా పెద్ద మొత్తంలోనే నిఘా బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఓటర్లను ప్రలోభపరిచేందుకు తరలిస్తున్న బంగారం, వెండి వస్తువులను కూడా భారీస్థాయిలోనే స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కూడా దాదాపు 414 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 38 కోట్ల రూపాయల విలువైన చీరలు, ఇతర వస్తువులు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లో అత్యధికంగా మాదకద్రవ్యాలు దొరికాయి. దేశవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచిన తమిళనాడులో పట్టుబడిన నగదు, బంగారం ఇతర ప్రలోభ వస్తువుల విలువ రూ. 401.46 కోట్లుగా లెక్క తేలింది. అక్కడ రూ. 162 కోట్ల నగదు లభ్యమైంది. 1289 కేజీల బంగారం, వెండి దొరికింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ రూ. 116 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 100 కేజీలకు పైగా బంగారం, 300 కేజీల వరకూ వెండి లభ్యమైంది. వీటి విలువ 190 కోట్లుగా లెక్క తేల్చారు.
ఆ తర్వాతి స్థానాల్లో 151 కోట్ల రూపాయలతో ఉత్తర ప్రదేశ్, 167 కోట్లతో పంజాబ్, 97 కోట్లతో మహారాష్ట్ర నిలిచాయి. దేశంలో అతితక్కువగా పాండిచ్చేరిలో 44 లక్షల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే… ఇందులోనూ కొసమెరుపులు ఉన్నాయి. ఒక్కరంటే.. ఒక్క బీజేపీ నేత పై కానీ… ఆ పార్టీ అనుబంధ సభ్యులపై కానీ ఎలాంటి దాడులు జరగవు. కానీ ఆ పార్టీ అభ్యర్థులు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూనే ఉంటారు. అక్కడే అందరికీ అనుమానాలొస్తున్నాయి.