ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్.. సినిమాను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇది ఒక్కటే కాదు.. రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలన్నింటినీ ఎన్నికలు అయ్యే వరకూ వాయిదా వేయాలని ఆదేశించింది. ‘‘రాజకీయ పార్టీలకు గానీ, వ్యక్తులకు గానీ ప్రచారం చేకూర్చే ఏ బయోపిక్లూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించకూడదు…’’ అని ఈసీ స్పష్టం చేసింది. దీంతో గురువారం విడుదల కావాల్సిన ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ సినిమాలో ప్రధాని మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు.
ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలన్న దానిపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోబోమనీ… ఎన్నికల సంఘమే దీన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మోదీ బయోపిక్ కారణంగా ఏదైనా రాజకీయ పార్టీకి లాభమో కాదో కూడా ఈసీనే తేల్చాలని పేర్కొంది. సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని.. నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే.. ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నిస్తూ.. దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతూండటంతో.. ఎన్నికల సంఘం వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు ఎన్ని కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా… మర్యాదపూర్వకంగా నోటీసులు ఇచ్చి సరి పెడుతోంది. మరో వైపు ఎలాంటి ఆరోపణలు లేకపోయినా… దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల పార్టీల విజ్ఞప్తుల ప్రకారం.. అధికారులను బదిలీలు చేస్తోంది.
తొలి విడత ఎన్నికలకు ఒక్క రోజు ముందు రాజకీయ నేతల బయోపిక్ ల విషయంలో… ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం.. ఆ రాజ్యాంగ బద్ధ సంస్థ విశ్వసనీయత మీద సందేహాలు వ్యక్తం కావడం వల్లే తీసుకున్నారు. అంతే కానీ.. ఈసీ సిన్సియర్ గా రూల్సేమీ ఫాలో కాలేదు. నిజంగా అలాంటి రూల్సే ఫాలో కావాలంటే.. మొట్టమొదటగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై… ఫిర్యాదు వచ్చినప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండేవారు. ఆ సినిమా విడుదలకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పి.. ఆ చిత్రంపై అభ్యంతరాలతో… కోర్టుకెళ్లేవరకూ తెచ్చారు. అయినప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయింది. ఏపీలో మాత్రం ఆగిపోయింది. ఏపీలో ఆగిందని చెప్పి.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశారు. చివరికి.. యాత్ర సినిమాను.. టీవీల్లో ప్రసారం చేయవద్దని… వచ్చిన ఫిర్యాదులను కూడా పట్టించుకోలేదు. ప్రదర్శించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం… తమ విశ్వసనీయత ప్రశ్నార్థకం అవడంతో .. ఏమీ ఎరుగనట్లు.. మోడీ బయోపిక్ తో పాటు.. ఏ రాజకీయ నేత బయోపిక్ కూడా విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.