ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తకొత్త డ్రామాలకు తెర తీస్తున్నారు అన్నారు ఉత్తప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు చేసిన స్టంట్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందన్నారు. ఏ నాయకుడైనా ఎన్నికలు సక్రమంగా జరగాలని కోరుకుంటున్నారనీ, కానీ చంద్రబాబు నాయుడు… అవినీతి సొమ్మును పంచేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని దిగజారుడు మాటలు మాట్లాడటం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి, పార్టీలతో పోటీ చెయ్యలేక సంస్థలపై పడుతున్నారన్నారు జీవీఎల్. ఓటమిని ముందుగా అంగీకరించినట్టుగా తెలుస్తోందన్నారు. పట్టుమని పదిమంది అధికారులను కూడా బదిలీ చెయ్యకపోతే అది చాలా చిన్న మార్పు మాత్రమే అవుతుందన్నారు. ‘ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి.. రాష్ట్ర ప్రభుత్వం లేకుండా రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగితేనే సజావుగా జరిగేవి’ అన్నారు జీవీఎల్. అయితే, అటువంటివి తాము డిమాండ్ చెయ్యలేదన్నారు.
ప్రతిపక్షాలు చెప్పిన అధికారులను తప్పించారు అంటే, అధికారంలో ఉన్న మీరే కదా దుర్వినియోగం చేసేదన్నారు జీవీఎల్. అధికారులను తప్పించారనే కంటే, ప్రతిపక్షాల ఫిర్యాదుల మేరకు ఇవి జరిగాయన్న ఏడుపులా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మీ ఓటమి తప్పదనీ, ప్రతిపక్ష పార్టీ హోదా కూడా తెలుగుదేశం పార్టీకి రాదనీ, పోలింగ్ జరిగే సమయంలో కూడా మరికొన్ని డ్రామాలకు టీడీపీ తెర తీస్తుందనీ, కాబట్టి వ్యవస్థ అంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఎన్నికల అధికారులకు యూపీ ఎంపీ సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు, ప్రచారపర్వం ముగిసిన తరువాత ఈ తరహాలో విమర్శలు చెయ్యొచ్చా లేదా అనేది ఈ సెఫాలజిస్టుకి తెలుసో తెలీదో ఆయనకే తెలియాలి.