అమ్మ, ఆవకాయ, ఆంధ్రప్రదేశ్… ఏ దేశమేగినా… ఏ ప్రాంతానికి పోయినా… ఆంధ్రులకు ఈ మూడు పంచప్రాణాలే. అమ్మకు కష్టం రాకుండా ఎలా చూసుకుంటారో… ఆంధ్రప్రదేశ్ కూ అంతే. అమెరికా పోయి మూడు దశాబ్దాలు దాటిపోయినా… అమెరికా కన్నా.. ఆంధ్రాలో ఏం జరుగుతుందో.. తెలుసుకోవడానికే ఆంధ్రులు ఆసక్తి చూపిస్తారు. కడప ఎన్నారై అయినా… సిక్కోలు చిన్నోడయినా… అమెరికాలో ఉన్నా… హైదరాబాద్ లో ఉన్నా.. తమ రాష్ట్రం.. తమ ఊరు ఎలా ఉంది… అనే భావననే మొదట మనసులో తెచ్చుకుంటారు. అది అవినావబంధం. విడదీనదీయలేనిది. మనసుతో ముడిపడిపోయింది.
అమ్మ.. ఆవకాయ.. ఆంధ్రప్రదేశ్..! ఈ మూడే పంచ ప్రాణాలు..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులందరి దృష్టి ఇప్పుడు సొంత రాష్ట్రంపై ఉంది. ఒకప్పుడు.. మద్రాస్ రాష్ట్రం నుంచి.. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో విడగొట్టారు. కర్నూలును రాజధాని చేసుకుని కూడా… భవనాలు ఉన్నాయన్న కారణంగా.. హైదరాబాద్‌ను రాజధాని చేశారు. చివరికి.. ఆంధ్రులంతా రెక్కలు ముక్కలు చేసుకుని… హైదరాబాద్ మనది… మనందరిది అని.. ఆంధ్రులంతా అనుకునేసరికి.. ఆంధ్రులు వేరు.. తెలంగాణ వేరు అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆంధ్రులకు అస్థిత్వ సమస్య వచ్చింది. నాడు మద్రాస్ కోల్పోయాం.. ఇప్పుడు హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం. ఇక ఆంధ్రాకు ఏముంది..? అనే నిరాశకర పరిస్థితి నుంచి… ఆంధ్రుల గర్వంగా తలెత్తుకోగలమన్న నమ్మకాన్ని ఐదేళ్లలో తెచ్చుకున్నారు. అందుకే.. అప్పుడు కోల్పోయిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు తొణికిసలాడుతోంది.
ఆంధ్రుల చైతన్యానికి వెలకట్టలేం..!
సంక్రాంతి పండుగకు దేశవిదేశాల నుంచి ఆంధ్రులు తరలి వస్తారు. కానీ ఓట్లక కోసం.. ఆ స్థాయిలో వెళ్లేవాళ్లు గతంలో తక్కువ. ఎందుకంటే… హైదరాబాద్ లాంటి చోట్ల స్థిరపడిన వారు… ఆంధ్రప్రదేశ్ అనే విశాల భావనతో… అక్కడే ఓటు హక్కు వినియోగించుకునేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అత్యధికులు.. తమ ఓటును ఏపీలో నమోదు చేయించుకున్నారు. తమ రాష్ట్ర భవిష్యత్ కోసం.. ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి.. ఓ రకమైన భావోద్వేగంతో ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ నుంచి లక్షలాదిగా తరలి వెళ్లిన జనసందోహం… ఇదే చెబుతోంది..
ఓటేద్దాం.. ఆంధ్రాని గెలిపిద్దాం…!
ఆంధ్రులకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. కష్టపడే గుణం వారి సొంతం. సొంత కష్టంపై ఎదుగడం వారి ఆత్మాభిమానం. ఐదేళ్లలో తాము చూసిన అభివృద్ధి వారిలో.. ఈ ఆత్మాభిమానాన్ని రెట్టింపు చేసింది. ఓ రకమైన భావోద్వేగం వారిలో కనిపిస్తోంది. అందరిలోనూ… ఒకటే భావన.. మన రాష్ట్రం.. మన ప్రదేశ్. ఓటేద్దాం.. ఏపీని గెలిపిద్దాం.. అనే ఆలోచనే..!.