ఓటెయ్యాలి. పోలింగ్‌రోజు పొద్దున్నే వెళ్లి ఓటెయ్యాలి. ఆ ఓటు పార్టీలను గెలిపించడానికి కాదు. మనం గెలవడానికి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి. మనం కోరుకున్న ప్రభుత్వం రావడానికి. ఓటు ఓ ఆయుధం. ప్రభుత్వాల్ని మారుస్తుంది. మన ప్రాథమ్యాలేమిటో, మనకెలాంటి పాలన కావాలో పాలకులకు అర్థమయ్యేలా ఓటు చెబుతుంది. ఓటు ఓ బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాళ్లంతా పాల్గొనితీరాల్సిన ఉద్యమం. రాజకీయాల్ని అసహ్యించుకుని ఒకరు, అవినీతికి రగిలిపోయి ఒకరు, అభ్యర్థి చరిత్ర తెలిశాక కడుపులో దేవినట్టనిపించి ఒకరు, మొత్తం వ్యవస్థంటేనే విరక్తి వచ్చి ఒకరు… ఆలోచించేవాళ్లూ ఆలోచించగలిగేవాళ్లూ కాస్తోకూస్తో బాధ్యతగా ఉండేవాళ్లంతా ఒక్కొక్కరే పోలింగ్‌కు దూరమైపోతే, ఓటేసేదెవరు?
పచ్చనోటు కోసమో, పావు సీసా మద్యం కోసమో హక్కును అమ్ముకుంటే అంత కంటే ఆత్మవంచన ఇంకొకటి ఉండదు. తక్కువ ఓటింగ్ నమోదయితే.. అనర్హులు చట్టసభలకు వెళ్తారు. ఆలోచించగలిగేవాళ్లు ఓటు వేయకపోతే, చట్టసభలు ఆలోచనలేనివాళ్లతో నిండిపోతాయి. పోలింగ్ పర్సంటేజీ… ఎంత ఎక్కువ ఉంటే.. అంత మంచి ఫలితాలు వస్తాయి. ఏపీ రాజకీయ చైతన్యం విషయంలో ముందే ఉంది. కానీ ఎప్పుడూ 75 శాతానికి దాటడం లేదు. ఏపీలో అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా.. అత్యల్ప ఓటర్లు ఉన్న జిల్లాగా విజయనగరం నిలిచింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3కోట్ల 93 లక్షల 45 వేల 717 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు కోటి 94 లక్షల 62 వేల 339 ఉండగా.. మహిళా ఓటర్లు కోటి 98 లక్షల 79 వేల 421 మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ విషయానికొస్తే..3,957 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య పరిశీలిస్తే ఇలా ఉంది.
అసెంబ్లీ స్థానాలకు మొత్తం 2 వేలా 118 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 పార్లమెంటు స్థానాలకు 319 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎన్నికల సంఘం 45 వేల 920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణ కోసం 3 లక్షల మంది సిబ్బంది. లక్షా 20వేల మంది పోలీస్ బలగాలు.. 7 వేలా 300 ప్రైవేటు బస్సులు.. రెండు హెలీకాప్టర్లను సిద్ధం చేశారు. 15 మంది అభ్యర్థులుంటే ఒక ఈవీఎం వినియోగం.. 15 మంది దాటితో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఈవీఎంలో 1400 మందికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి 34 మంది అభ్యర్థులు బరిలో నిలిచినందుకు 3 ఈవీఎంలు వాడనున్నారు. ఇవన్నీ ప్రజాస్వామ్య బలోపేతం కోసమే. ఓటరన్న ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికే..!