ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. చాలా మంది సెలబ్రెటీలు, సామాన్య ప్రజలు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పలుచోట్ల ఈవీఎం మిషన్లు మొరాయించడం పై, ఏర్పాట్లు సరిగా లేకపోవడం పై నేతలు ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంక నిజామాబాద్ ఎంపీ కవిత స్వగ్రామం లో ఈవిఎం మిషన్లు సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దీనిపై కవిత కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక విశాఖపట్నంలో జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పోలింగ్ నిర్వహణపై విమర్శలు చేశారు. ప్రజలు ఉదయాన్నే వచ్చినప్పటికీ, ఈవీఎం మిషన్లు పనిచేయకపోవడంతో దాదాపు గంటన్నరపాటు ఓటర్లు క్యూలో ఉన్నారు. సిబ్బంది నుండి సరైన సమాధానం కూడా ఎవరూ ఇవ్వకపోవడంతో లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పిసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కూడా ఉదయం 7 గంటలకే ఓటు వినియోగించుకోవడానికి వెళ్లినప్పటికీ, ఈవీఎం మెషిన్ లు పనిచేయకపోవడంతో చాలాసేపు వేచి ఉన్నారు. ఇక గుత్తిలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా, ఇవిఎంలు చాలా సేపు పని చేయకపోవడంతో ఆగ్రహం తో ఈవీఎంలు నేలకేసి కొట్టారు. దీంతో పోలింగ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా జనసేన అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈవీఎంలు మొరాయించడం, ఎలక్షన్ కమిషన్ పై అధికారులు అనేక ఫిర్యాదులు చేయడం, ఇటీవలి కాలంలో ఈవీఎంలపై సందేహాలు పెరగడం – ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ పనితీరుపై, వారి సమగ్రతపై ప్రజలకు అనుమానాలు కలిగిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించడం, అనుమానాలను నివృత్తి చేయడం లో ఎన్నికల సంఘం ఏమరపాటు ప్రదర్శిస్తే ప్రజలలో అనుమానాలు మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది.