ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. దాదాపు 80 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. రాష్ఱంలో యువత, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమాతో వారున్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… అక్కచెల్లెమ్మలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారని అన్నారు. వారు ఆ సంఖ్యలో వస్తారని ముందే ఊహించామని, ఎందుకుంటే, డ్వాక్రా మహిళలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మోసం చేశారనీ, 2016 మే నుంచి సున్నా వడ్డీ వర్తించకుండా చేశారన్నారు. వారి రుణాలను కూడా మాఫీ చెయ్యలేదన్నారు. చంద్రబాబుకి గుణపాఠం చెబుదామనే మహిళలంతా ఓటింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు.
దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయమన్నారు జగన్. ఓటమి తప్పదని చంద్రబాబు నాయుడుకి తెలిసిపోయిందనీ, అందుకే దిగజారి మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. ఓటమి భయంతోనే ప్రజలను తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు రకరకాల నాటకాలు తెరమీదికి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసమే ప్రజలంతా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని జగన్ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పడానికి పెరిగిన ఓటింగ్ శాతమే సాక్ష్యమన్నారు. ఈవీఎంల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ… ఎవరికి ఓటు వేసిందనేది వీవీప్యాట్ స్లిప్పుల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, దానిపై అంతగా ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. కేవలం ఓటమి భారంతోనే అలా మాట్లాడారని విమర్శించారు.
మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓట్లు వెయ్యడం తమకే అనుకూలం అన్నట్టుగా టీడీపీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. పసుపు కుంకుమ, పెంచిన పెన్షన్… ఇవే వారిని పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున రప్పించాయనీ, దాన్ని ప్రభుత్వ వ్యతిరేకత అని వైకాపా అనుకుంటే పొరపాటే అన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైమైనా, ఫలితాలు వచ్చేవరకూ ఇలాంటి అంచనాలు, లెక్కలు చాలానే వస్తుంటాయి.