ఎన్నికల నిర్వహణ అనగానే అధికార పార్టీకి కొంత సానుకూల వాతావరణం ఉంటుందనే అభిప్రాయం సహజంగానే ఉంటుంది. ఎందుకంటే, అధికారులూ పోలీసులు ఇతర సిబ్బంది అంతా ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఉంటారు. కాబట్టి, సిబ్బందిపరంగా వారికి కొంత సానుకూలత ఉంటుందని అనుకుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర్నుంచీ పరిస్థితి రివర్స్ అయింది. ఎన్నికల సంఘం ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం ప్రజలకు కలిగింది. దానికి తగ్గట్టుగానే వైకాపా నాయకులు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చెయ్యడం, వారు చెప్పినట్టుగానే ఆఫీసర్ల బదిలీలు జరిగాయి.
ఎన్నికల రోజుకు వచ్చేసరికి పరిస్థితి ఎలా మారిందంటే… ఎన్నికల సంఘం పనితీరుపై అధికార పార్టీ ధర్నాలు చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీ ఈసీకి మద్దతుగా వ్యవహరించింది. ఎన్నికల ఏర్పాట్లపై, ఈవీఎంలపై ఎన్నికల సంఘం దగ్గరకి ముఖ్యమంత్రి వెళ్లి, తన ఆగ్రహాన్ని ఆవేదనని వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. ఆ వెంటనే, వైకాపా నాయకులు ఈసీ దగ్గరకి వెళ్లి… ఎన్నికల సంఘాన్ని టీడీపీ అధినేత విమర్శించారు, కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఈసీని చంద్రబాబు దూషించి ఉంటే, దానిపై చర్యలు వారే తీసుకుంటారు. ఇంకొకరు ఫిర్యాదు చెయ్యాల్సిన అవసరం లేదు కదా.
ఈవీఎంలు తీవ్రంగా మొరాయించి, గంటల తరబడి ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. ఈవీఎంల పనితీరుపై రకరకాల అనుమానాలను చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తే… దానికి కౌంటర్ అన్నట్టుగా జగన్ మాట్లాడుతూ, ఎవరికి ఓటు వేసినా అది వీవీప్యాట్లలో కనిపిస్తున్నప్పుడు అనుమానించాల్సిన అవసరం ఏముందని స్పందించారు. అంతేగానీ, ఎన్నికల నిర్వహణ తీరుపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి అసంత్రుప్తి వ్యక్తమైనా, ఓటింగ్ ఆలస్యంగా మొదలు కావడానికి అధికారుల సమన్వయ లోపమని అంటున్నా… దానిపై జగన్ ఘాటుగా విమర్శించలేదు. వైకాపాకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఈ మధ్య వినిపిస్తున్న ఆరోపణలకు మరింత బలమిచ్చే విధంగానే నాయకుల తీరు ఉంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలని అన్ని పార్టీలూ కోరుకోవాలి. ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉండాలి. కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఈసీ వైఫల్యాన్ని కూడా వెనకేసుకొచ్చే విధంగా ఒక పార్టీ తీరు ఉండటం గమనార్హం.