తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హడావుడిగా నిర్వహించడంపై… జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఓటర్ జాబితాల విషయంలో…. కాంగ్రెస్ పార్టీకి చెందిన మర్రి శశిధర్ రెడ్డి లాంటి వాళ్లు … హైకోర్టు వరకూ వెళ్లిపోరాడారు. కానీ ఈసీ.. అంతే పట్టుదలగా.. ఏమీ సమస్యలు లేవన్నట్లుగా చెప్పి… ఎన్నికలు నిర్వహించేసింది. మొత్తంగా 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఆ తర్వాత తేలింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో… ఘనత వహించిన ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్… సింపుల్ గా సారీ చెప్పారు. పనైపోయిందని సంతృప్తి పడ్డారు. కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు.
ఇక ఏపీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలకు భద్రత కల్పించడంలో.. ఈసీ ఘోరంగా విఫలమయింది. కావాల్సినంతగా భద్రతా బలగాలు పంపలేదు. పంపాలని.. ఇక్కడ సీఈవో ఒత్తిడి చేయలేదు. చేయడానికి కూడా చాన్స్ లేదు. ఎందుకంటే.. ఏపీ ఎన్నికల నిర్వహణ మానిటరింగ్ మొత్తం.. ఢిల్లీ నుంచే నడిచింది. అంతా అయిపోయిన తర్వాత ద్వివేదీ కూడా… సారీ చెప్పారు. అవును.. ఎన్నికలకు భద్రత కల్పించలేకపోయామని.. చేతులెత్తేశారు. అచ్చంగా ఓట్ల గల్లంతు విషయంలో… తెలంగాణలో ఏం జరిగిందో…. భద్రత విషయంలో.. ఏపీలోనూ అదే జరిగింది. ఇద్దరూ సారీలతో సరిపెట్టారు.
తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో జరిగిన జరిగిన వ్యవహారాలే మరింత అనుమానాస్పదంగా మారాయి. ముందుగా.. సిసోడియా అనే ఎన్నికల అధికారి ఉండేవారు. ఆయన వచ్చి ఏడాదే. ఆయినప్పటికీ.. ఆయనను తొలగించి… ద్వివేదీని తెచ్చారు. అదే సమయంలో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో .. విమర్శలు ఎదుర్కొన్న రజత్ కుమార్ ను మాత్రం తొలగించలేదు. అక్కడ్నుంచే అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరవాత ఏపీలో జరిగిన వ్యవహారాలు అందరూ చూశారు. ఈ దెబ్బతో.. ఈసీపై అందరికీ విశ్వాసం పోయినట్లయింది.