కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం మొన్న తునిలో నిర్వహించిన బహిరంగ సభ హింసాత్మకంగా మారడంతో దానిపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఒకదానిపై మరొకటి విమర్శలు గుప్పించుకొంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని క్రిమినల్ నెంబర్:1 అంటే, ముఖ్యమంత్రి అతనిని ‘దుర్మార్గుడు’ అని అన్నారు. తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి ముద్రగడను ‘శిఖండి’గా అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి ఆయనను శిఖండిలాగ అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “ఒకప్పుడు ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి అదే పని చేసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నాడు,” అని గోరంట్ల విమర్శించారు. కాపు గర్జన సభకి వెళ్ళిన వారిలో చాలా మంది వైకాపాకి చెందినవారే ఉండటమే అందుకు నిదర్శనమని అన్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు ప్రతివిమర్శలు ఈవిధంగా సాగుతుంటే తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, నల్లగొండ ఎం.పి గుత్తా సుఖేందర్ రెడ్డి దీనిపై వ్యక్తం చేసిన అభిప్రాయం చాలా సహేతుకంగా ఉంది. అధికారప్రతిపక్ష పార్టీల నేతలు అందరూ కాపు ఆందోళనకారులను తప్పు పట్టడానికి భయపడుతున్నందునే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారు.
దీనికంతటికి మూలకారకుడయిన ముద్రగడ పద్మనాభాన్ని అధికార పార్టీ నేతలు నేటికీ గట్టిగా ఏమీ అనలేకపోతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కారణాల వలననే ఆయనని అరెస్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. అందుకే తెదేపా నేతలు ఆయనని చాలా సున్నితంగా విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డినే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.