చిత్రసీమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఓ సీజన్లో పోలీస్ కథలు వరుస కట్టేస్తాయి. మరో సీజన్లో లవ్ స్టోరీలు వచ్చేస్తుంటాయి. ఇంకోసారి… ఫ్యామిలీ డ్రామాల హవా. అయితే ఈసారి మాత్రం `ఫెయిల్యూర్` స్టోరీల పరంపర కనిపిస్తోంది. కాకపోతే.. ఇది కాకతాళీయంగా జరిగినదే. ఈ నెలలో వచ్చిన.. మజిలీ, చిత్రలహరి రెండూ ఫెయిల్యూర్ స్టోరీసే. వచ్చే వారం రాబోతున్న జెర్సీ కూడా అలాంటి కథే.
మజిలీలో హీరోది లవ్ ఫెయిల్యూర్. ప్రేమించిన అమ్మాయి దూరమైపోయి, అటు కెరీర్ కూడా చేజారిపోయి, ఇష్టం లేని పెళ్లి చేసుకున్న పూర్ణ అనే కుర్రాడి కథ.. మజిలీ. చిత్రలహరి అయితే.. ఈ ఫెయిల్యూర్ డోసు కొంచెం ఎక్కువైంది. జీవితంలోనూ, కెరీర్లోనూ, ఆఖరికి ప్రేమలోనూ ఓడిపోయిన విజయ్ గాథ… చిత్రలహరి. తన పరాజయాల్లోంచి బయటపడి విజయ్ ఏరకంగా విజయతీరం చేరాడన్నదే కథ.
జెర్సీ కూడా అలాంటి కథే. అర్జున్ అనే ఓ ఫెయిల్యూర్ క్రికెటర్ కథ ఇది. 36 ఏళ్లొచ్చాక, తన కొడుకు ముందు హీరో అవ్వాలన్న ఆశతో మళ్లీ బ్యాటు పట్టుకుని, గ్రౌండులోకి అడుగుపెట్టిన అర్జున్… తాను అనుకున్నది సాధించాడా? లేదా? అనేది జెర్సీలో చూడొచ్చు. ఇంచుమించుగా మూడు కథల ముడిసరుకు.. ఫెయిల్యూరే. దాన్నే కథగా చూపించిన మజిలీ సక్సెస్ అయ్యింది. చిత్రలహరి విజయానికి అటూ ఇటూ ఊగిసలాడుతోంది. మరి జెర్సీ సంగతేంటో ప్రేక్షకులే చెప్పాలి.