ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇంకా తీవ్ర విమర్శలు చేసే పనిలోనే ఉన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత ఎన్నికల్లో ఈవీఎంలు మంచివని చంద్రబాబు అన్నారనీ, తానే హైటెక్ సీఎం అన్నారనీ, కానీ ఇప్పుడు తాను వేసిన ఓటు ఎటు పోయిందో అని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో పని చేయని ఈవీఎంలు 300 మాత్రమేనని విన్నాననీ, ఎన్నికల్లో ఇలాంటివి సర్వసాధారణమనీ, ఓ గంటలో ఇలాంటివి సర్దుకుంటాయన్నారు. కానీ, దానికి చంద్రబాబు అతిగా స్పందించేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెండోమూడో హింసాత్మక సంఘటలు జరిగితే… అంతా గూండాయిజం రౌడీయిజం అని వాపోయారన్నారు.
ఇద్దరో ముగ్గురో ఎస్పీలను మార్చారనీ, మరికొంతమంది పోలీసులు, చీఫ్ సెక్రటరీని బదలీ చేశారనీ… వ్యవస్థ అంటే మొత్తంగా ఇంతేనా అనీ, ఈ మాత్రం దానికి చిల్లర చిల్లరగా రాద్దాంతం చేశారని తలసాని అన్నారు. ఛీఫ్ సెక్రటరీని పట్టుకుని ఆయన మీద కేసులున్నాయని అన్నారనీ, చంద్రబాబు మీద లేవా కేసులు అంటూ విమర్శించారు. హైదరాబాద్ లో ఉన్నవాళ్లని బెదిరించారని చిల్లర విమర్శలు చేశారన్నారు. చంద్రబాబుకి ఆంధ్రాపై అంత ప్రేమే ఉంటే, ఇక్కడి ఆస్తులు అమ్మేసుకుని వెళ్లిపోవాలని సవాల్ చేశారు. ఈవీఎంల గురించి జగన్ మాట్లాడలేదని ఈయన అనడమేంటని ప్రశ్నించారు. ఆయనేదంటే అందరూ అదే అనాలా అని ప్రశ్నించారు. ఎలక్షన్ల ముందు అన్నదాత సుఖీభవ, అదేదో పసుపు కుంకుమట… సిగ్గులేదూ, ఐదేళ్లుగా ఇవ్వడం చేతగాదూ అని తలసాని విమర్శించారు. ఇవన్నీ మభ్యపెడితే జనాలు ఓటేస్తారనుకున్నారా అన్నారు. కొన్ని ఛానెళ్లలో గంటల గంటలు లైవ్ లు పెట్టారనీ, ఆయన ప్రచారంలో ఏమైనా కొత్తగా మాట్లాడారా అన్నారు. సినిమా యాక్టర్ లాగ ఒక ఎయిర్ మైక్ తగిలించుకున్నారనీ… ఇలా తీవ్ర విమర్శలకు దిగారు తలసాని.
ఇంతకీ తలసాని బాధేంటి? ఏపీలో ఎన్నికలు ఎలా జరిగాయో ఆయనకు సరిగా తెలిసినట్టు లేదు. కొన్ని చోట్లే కదా ఈవీఎంలు, కొన్ని గంటలే కదా ఆలస్యం, కొంతమంది అధికారులనే కదా బదిలీలు, కొన్ని హింసాత్మక ఘటనలే కదా…. ఇలా ఎవరైనా వెనకేసుకొస్తారా..? ఈ కొన్నీ కొన్నీ కలిపితే ఎన్ని అయ్యాయి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు ఏవీ లేవు కదా. ముందస్తుగా అసెంబ్లీ రద్దు చేద్దామని కేసీఆర్ నిర్ణయించుకున్న దగ్గర్నుంచీ పైనుంచి వారికి అందాల్సిన సాయం అందింది. ఇక, ఆంధ్రాకి వచ్చేసరికి… అన్ని రకాలుగా టీడీపీని ఇబ్బంది పెట్టాలన్న కుట్ర తెరపైకి వచ్చింది. దాన్లో తెరాస తమవంతు పాత్ర పోషించింది కదా. ఎందుకీ ఆవేదన? ఆ పాత్ర పోషణలో ఏమైనా తేడా కొట్టిందా..? వారు అనుకున్నట్టుగానే జరిగితే… ఇంకా ఎందుకీ కంఠశోష..? చంద్రబాబుపై ఎందుకింత దిగజారుడు విమర్శలు? బహుశా వైకాపా నాయకులు కూడా ఇంత తీవ్రంగా ఇంకా స్పందించలేదే… మరి ఈయనకి ఎందుకంత ఇదీ?