రెండో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ముఖ్యంగా ఇప్పుడు వారి ఫోకస్ తమిళనాడు మీద ఉంది. అక్కడి ప్రజల్లో భాజపా మీద వ్యతిరేకత ఉందన్న విషయం మోడీకి తెలియంది కాదు. మాజీ ముఖ్యమంత్రి అమ్మ జయలలిత మరణం తరువాత.. తమిళ రాజకీయాల్లో పట్టుకోసం తెర వెనక ఉండి, వారు నడిపిన మంత్రాంగంపై తమిళులు అప్పట్నుంచే ఆగ్రహంగా ఉన్నారు. గడచిన కొన్నాళ్లలో తమిళనాడులో కులాలు, మతాలు పేరుతో స్పష్టమైన విభజన తీసుకొచ్చే ప్రయత్నం భాజపా చేసిందనే విమర్శలు తమిళనాట ఉన్నాయి. చివరికి, శబరిమల వివాదాన్ని తమిళనాడులో కూడా భాజపా వాడుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, తమిళనాడులో ప్రచారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ… హిందీ మాట్లాడటం మానేసి, కేవలం ఇంగ్లిష్ లో మాత్రమే ప్రసంగించడం విశేషం. సహజంగానే హిందీ భాష మీద తమిళుల్లో కొంత వ్యతిరేకత ఉంది. కాబట్టి, తాను హిందీలో మాట్లాడితే… ఎలాంటి సంకేతాలు వెళ్తాయో అనే లెక్కల్లో ఏకంగా భాష మార్చేశారు మోడీ. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఏ రాష్ట్రంలో కూడా ఆయన హిందీని వదల్లేదు. చివరికి, హిందీ పెద్దగా పరిచయం లేని ఆంధ్రాలో ప్రచారం చేసినా కూడా హిందీలోనే ప్రసంగించారు. కానీ, తమిళనాడులో ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. చాలా అంతర్జాతీయ వేదికల మీద కూడా హిందీలోనే ఆయన మాట్లడటం చూశాం. ఇంగ్లిష్ మాట్లాడటం తప్పు కాదు. కానీ, ఈ క్రమంలో తమకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని భావించే రాష్ట్రాల దగ్గరకి వచ్చేసరికి… సున్నితమైన అంశాల పట్ల మోడీకి అమాంతంగా కలుగుతున్న అత్యధిక జాగ్రత్త గురించే చెప్తున్నది.
కాంగ్రెస్ కి ఓటేస్తే ఎక్కువ పన్నులు, తక్కువ అభివ్రుద్ధి జరుగుతుందని తమిళనాట ప్రచారం చేస్తున్నారు. కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి శబరిమల ఆలయంతో ఆటలాడుకుంటున్నాయన్నారు. మన అద్రుష్టం కొద్దీ భాజపా ఉందనీ, మన సంస్క్రుతినీ ఆచార సంప్రదాయాలను నాశనం చేసేవారికి అడ్డుకుంటుందని.. శబరిమల ఇష్యూని కూడా ప్రచారానికి వాడేసుకున్నారు. అంతేగానీ, పెద్ద నోట్ల రద్దు, నల్లధనం వెలికితీత ఇలాంటి టాపిక్ లు మాట్లాడటం లేదు.