తేజ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమా సీత. నేనే రాజు-నేనే మంత్రి అనే సినిమా తప్పిస్తే, గత ఆరేడేళ్లలో ఒక్క హిట్ లేదు దర్శకుడు తేజ కు. పైగా నేనే రాజు నేనే మంత్రి సినిమా స్క్రిప్ట్ రానా తండ్రి సురేష్ బాబు కొన్నేళ్లపాటు సానపట్టించిన స్క్రిప్ట్. కానీ సీత అలా కాదు. ఇదే స్క్రిప్ట్ రామానాయుడు స్టూడియోలో చిరకాలంగా నలిగిందని వార్తలు వున్నాయి. వెంకటేష్ కోసం దాన్ని చిత్రిక పట్టించి, పట్టించి, ఇక సరికాక వదిలేసారని గుసగుసలు వున్నాయి. అదే స్క్రిప్ట్ సీతగా మారిందని వదంతులు అయితే వున్నాయి. నిజమెంతో తేజ కే తెలియాలి.
ఇదిలా వుంటే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు గతంలో మార్కెటింగ్ హైప్ ప్రయత్నాలు జరిగాయని టాలీవుడ్ లో టాక్ వుంది. బెల్లంకొండ సురేష్ కు పరిచయస్థులే ముందు ఎక్కువ రేటుకు కొనేయడం, తరువాత కాళ్లు తేలేయడం లాంటివి జరిగాయని టాక్ వుంది. దానివల్లే జయజానకీనాయక లాంటి కాస్త మంచి సినిమాలు కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యాయి.
సాక్ష్యం తరువాత కాస్త రేట్లు తగ్గించి, మామూలుగా ముందుకు వెళ్తున్నారు. రాక్షసన్ సినిమా తెలుగు వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ అవుట్ రేట్ 15 కోట్లకు ఇచ్చేసారని తెలుస్తోంది. కాదు 16 అని 18 అని వాదనలు వున్నాయి. అది వేరే సంగతి. ఈ సినిమా కొన్నది గతంలో సాక్ష్యం సినిమా నిర్మించిన అభిషేక్ నామా. అందువల్ల డీల్ ఏమిటన్నది వాళ్లు చెప్పిందే తప్ప వాస్తవం బయటకు రాదు.
లేటెస్ట్ గా సీత సినిమా వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ 18 కోట్లకు వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ కొన్నారని వార్తలు బయటకు వచ్చాయి. అభిషేక్ అగర్వాల్ ఎవరో కాదు, సీత సినిమా నిర్మాణంలో భాగస్వామే. అందువల్ల ఇక్కడా నిజాలు బయటకు రావు.
బెల్లంకొండ సినిమాలకు శాటిలైట్, డిజిటల్, హీందీ రైట్స్ ద్వారా మంచి మొత్తాలు వస్తాయి. అందులో సందేహం లేదు. కానీ వరుసగా సినిమాల థియేటర్ అమ్మకాలు మాత్రం లాభాలు కళ్ల చూడడం లేదు. అందువల్ల మార్కెట్ స్లోగా డౌన్ అవుతోంది. దాన్ని పికప్ చేయించానికే ఈ ఇద్దరు అభిషేక్ లు రంగంలోకి దిగారా? అసలు ఎంతకు కొన్నారు. ఎంతకు కొన్నారని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి అన్నది తెలియాల్సి వుంది.