హైదరాబాద్: కాపులను బీసీల్లోకి చేర్చేదాకా రోడ్లపై, పట్టాలపైనే బైఠాయిస్తామని ఆ సామాజికవర్గ నాయకుడు ముద్రగడ పద్మనాభం మొన్న సంచలన నిర్ణయం తీసుకోవటం, ఆందోళనకారుల్లో అల్లరిమూకలు చేరి విధ్వంసానికి దిగటంతో తన నిర్ణయాన్ని మార్చుకుని ఆందోళనను విరమించుకోవటం తెలిసిందే. అయితే కాపుల ఆందోళన ముగిసిపోయినట్లు భావించలేము. ప్రభుత్వం స్పందించకపోతే శుక్రవారం నుంచి తాను భార్యాసమేతంగా ఆమరణనిరాహారదీక్షకు కూర్చుంటానని ముద్రగడ నిన్న ప్రకటించారు. ఇటు నిన్న మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పద్మనాభాన్నిగానీ, కాపు పెద్దలనుగానీ చర్చలకు పిలవటంలేదు. దీనితో సమస్య అలాగే నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయింది.
ఈ పరిస్థితుల్లో కాపు సామాజికవర్గానికి చెందిన తలపండిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి ముందుకొచ్చారు. ఆయన ఇవాళ ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకూ సూచించారు. అవసరమైతే చంద్రబాబు నాయుడుకు, ముద్రగడకు మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని చెప్పారు. చంద్రబాబు, ముద్రగడ ఇద్దరూ కూడా మొండి వైఖరితో ఉన్నారని అన్నారు. ఇరు వర్గాలూ అంగీకరిస్తే తనతోబాటు కాపు పెద్దలు, కాపు రిటైర్డ్ అధికారులను కలుపుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.