పోలింగ్ ముగిసి.. సరళిని విశ్లేషించుకుంటున్న పార్టీలు.. ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోకూడదన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ఏపీలో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలు అయినా టీడీపీ, వైసీపీ… అటూ ఇటూ కాని పరిస్థితి వస్తే… అండగా ఉండేవారి కోసం.. వెదుకులాట ప్రారంభించాయి. ఈ సారి 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. దాదాపుగా.. యాభై నియోజకవర్గాల్లో మాత్రమే త్రిముఖ పోటీలు జరిగాయి. మిగతా చోట్ల ముఖాముఖి జరిగాయి. గెలుపు సాధించేంత స్థాయిలో రెబల్స్ కూడా బరిలో లేరు. దీంతో.. ఈ సారి మూడు పార్టీలకు మాత్రమే..సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీలతో పాటు.. జనసేనకూ కొన్ని సీట్లు వస్తాయని.. సర్వేలు వెల్లడించాయి. భారీగా కాకపోయినా.. కనీసం మూడు నుంచి పది సీట్ల వరకూ.. జనసేన ఖాతాలో వేస్తున్నారు. ఈ సీట్లే ఇప్పుడు… టీడీపీ, వైసీపీలకు గొప్పగా కనిపిస్తున్నాయి. త్రిశంకుసభ ఏర్పడితే.. ఇతరులు, చిన్న పార్టీల ఎమ్మెల్యేలే కీలకం అవుతారు. అలాంటి అవకాశం జనసేనకు మాత్రమే ఉంది. అందులో.. రేసులో ఉన్న జనసేన అభ్యర్థుల జాబితాలను బయటకు ఇప్పటికే… టిక్ పెట్టుకున్నాయి రెండు పార్టీలు. జనసేనకు ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో మాత్రమే.. విజయం కోసం పోటీ పడిన అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఎవరైతే.. గట్టిగా ప్రయత్నించారో వారి కోసం టీడీపీ, వైసీపీ నేతలు స్కెచ్ లేయడం ప్రారంభించారని చెబుతున్నారు.
విశాఖ జిల్లాలో పవన్ కల్యాణ్ కాకుండా… మరో జనసేన అభ్యర్థి.. విజయం కోసం గట్టిగా ప్రయత్నించారు. ఆ అభ్యర్థి స్వతహాగా జనసేన అభ్యర్థి కాదు. ఓ పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉండి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసి… దక్కదని తెలిసి.. జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు జనసేన తరపున అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందో లేదో కానీ.. ఆయన పాతపార్టీ నేతలు ఇప్పటికే టచ్‌లోకి వచ్చారని చెబుతున్నారు. ఆయన కూడా.. టిక్కెట్ కోసమే జనసేనలోకి వచ్చారు కాబట్టి.. టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. తూ.గో జిల్లాలో జనసేన తరపున బరిలో ఉన్న వారిలో బలమైన అభ్యర్థులుగా ఉన్న వారిలో అత్యధికులు…. వైసీపీ నేతలే. వైసీపీలో టిక్కెట్లు దొరకక.. జనసేనలో చేరారు. వారందర్నీ.. ఇప్పుడు వైసీపీ అగ్రనేతలు.. దువ్వేపనిలో ఉన్నారు. ఓ రిజర్వుడు నియోజకవర్గం నుంచి రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, అలాగే.. చివరి క్షణంలో జగన్ హ్యాండివ్వడంతో..కన్నీరుమున్నీరై జనసేనలో చేరిన మరోనేత, అందరి కంటే ముందుగానే టిక్కెట్ ఖరారుచేసుకున్న మరో అభ్యర్థికి గెలుపు అవకాశాలున్నాయంటున్నారు. వారందరితో… వైసీపీ నేతలు టచ్‌లోకి వెళ్లారు. వైసీపీకోసం పెట్టుకున్న ఖర్చు మాత్రమే కాదు.. ఎన్నికల ఖర్చులు కూడా తిరిగి ఇస్తామని.. అలాగే ప్రభుత్వంలో మంచి పదవి కూడా ఇస్తామని బేరం పెట్టేశారని చెబుతున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో కూడా… ఇద్దరు అభ్యర్థులు జనసేన తరపున.. గట్టి పోటీ ఇచ్చారనే భావన ఉంది. వీరిని.. తెలుగుదేశం పార్టీ నేతలు దువ్వుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక కృష్ణా జిల్లాలో ముగ్గురు అభ్యర్థులు జనసేన తరపున గట్టిగా పోరాడారు. వీరితో టచ్‌లోకి వెళ్లేందుకు.. టీడీపీ, వైసీపీ తరపున కొంత మంది కీలక నేతలే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులతో… టీడీపీ నేతలు… పరిచయాలు పెంచుకుంటున్నారు. ఓ అభ్యర్థి వైసీపీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
జనసేన తరపున ఎంత మంది గెలిచినా.. పవన్ కల్యాణ్ పై వారు ఎంత విశ్వాసంగా ఉంటారన్నది ఊహించడం కష్టమే. అదే.. హంగ్ అసెంబ్లీ అంటూ ఏర్పడితే.. మాత్రం.. పవన్ కల్యాణ్ కూడా.. వారిని తన కంట్రోల్ లో ఉంచుకోవడం కష్టమన్న అంచనాలు ఉన్నాయి. అయితే.. టీడీపీ, వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ముందుగా పరిచయాలు పెంచుకుంటున్నాయి కానీ.. ఎలాంటి హామీలు నేరుగా ఇవ్వడం లేదు. ముందు ముందు.. రాజకీయ పరిస్థితుల్లో క్లారిటీ వచ్చేటప్పటికీ.. వారికీ ఆఫర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్.. వారిని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.