రెండోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ కేసీఆర్ రాజకీయ లక్ష్యాలను ఒక దాని తరువాత మరొకటి పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులకు పొలిటికల్ టార్గెట్లను ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారని అనుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించినా, వలసల్ని ప్రోత్సహించడం వదులుకోలేదు. ఆ బాధ్యతను కొంతమందికి అప్పగించిన తీరును చూశాం. ఇక, లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి… తెరాస ఎమ్మెల్యేలందరికీ ఎంపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని అప్పగించారు. నిన్నమొన్నటి వరకూ వాళ్లకి అదే పని. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో అయిపోయాయి. ఇక్కడితోనైనా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కాస్త ఊపిరి తీసుకుంటారనుకుంటే… ఇప్పుడు మరో రాజకీయ లక్ష్యం నిర్దేశించారు కేసీఆర్.
సారు.. కారు… పదహారు.. ఈ నినాదంతో లోక్ సభ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్, ఇప్పుడు అదే నినాదంలో కాస్త మార్పు చేసి సారు, కారు, 32 జిల్లాలు అంటున్నారు. రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. 5,857 ఎంపీటీసీలు, 530 జెడ్పీటీసీలు, 32 జెడ్పీ ఛైర్మన్ పదవులు… ఇప్పుడు వీటిని నూటికి నూరుశాతం గెలుచుకోవాలన్న లక్ష్యంతో కేసీఆర్ సిద్ధమౌతున్నారు. అన్ని జిల్లాల్లోనూ తెరాస విజయం సాధించాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. రెండేసి జిల్లాలకు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. రాబోయే ఈ ఎన్నికల్లో తెరాస అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ప్రగతి భవన్ లో నేతలతో చర్చించారు. ఈ సందర్భంలోనే ఈసారి సారు కారు 32 జిల్లా పరిషత్ లు అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయం తెర మీదకి వచ్చినట్టు సమాచారం.
ఎమ్మెల్యేల సంఖ్య అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగానే సాధించారు. ఇప్పుడు 16కి 16 ఎంపీలు గెలవడం ఖాయమంటున్నారు. ఈ రెండిటి తరువాత పెద్ద పదవులు అంటే రాష్ట్రంలో ఏమున్నాయి… జెడ్పీలే కదా. వాటిని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలవాలని లక్ష్యం నిర్దేశించారు. అంటే, తెరాస సర్కారు ఏర్పడి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా… ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు ఇంకా పార్టీ నిర్దేశించిన రాజకీయ లక్ష్యాల కోసమే అధిక సమయం కేటాయిస్తున్నట్టు లెక్క. సాధారణ పరిపాలనా వ్యవహారాలపై మాట్లాడిన మంత్రులుగానీ, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న ఎమ్మెల్యేలుగానీ ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో కనిపించని పరిస్థితి. పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో పట్టుదల చూపుతున్నారు. ఎన్నికలు నిర్వహణ తప్పదుగానీ… ప్రజా ప్రతినిధులంతా అదే పనిలో ఉంటే ఎలా అనేదే ప్రశ్న? సొంత పార్టీ సేవలకే సమయమంతా వినియోగిస్తే… ప్రజలకు అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు..?