వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడం అన్నది జీవితకాలపు లక్ష్యం. ఆ విషయాన్ని ఆయన చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించరు. తనకు ముఖ్యమంత్రి కావడమే ప్రధమ లక్ష్యమని… జాతీయ మీడియా ఇంటర్యూల్లోనూ చెప్పుకొచ్చారు. అది జరగాలంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోవాలి. ఆయన లక్ష్యాలకు తగ్గట్లుగానే… ఆ పార్టీ నేతలు కూడా.. ఆయనను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయనను ఉబ్బేయడానికి అదే పని చేస్తున్నారు.
నేమ్‌ప్లేట్, కేబినెట్ కూడా రెడీ చేసేసుకున్నారా..?
ముఖ్యమంత్రి పదవిపై… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంత ఆశ పెట్టుకున్నారో.. ఆయన మాటల్లో తరచూ బయట పడుతూనే ఉంటుంది. సీఎం కావడమే తన లక్ష్యమని.. జాతీయ మీడియా ఇంటర్యూల్లో నిర్మోహమాటంగా చెప్పారు కూడా. అంత వరకూ బాగానే ఉంది.. కానీ.. ఇప్పుడు పోలింగ్ ముగియగానే.. ఆ పార్టీ నేతలు… ఇక ప్రమాణస్వీకారం చేయడమే తరువాయన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియాలో అత్యధికంగా.. ట్రోల్ అయిన… ఫోటో జగన్మోహన్ రెడ్డి నేమ్ ప్లేట్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినట్లేనని.. నేమ్‌ప్లేట్ తయారు చేయించేశారు. ఆ ఫోటో బయటకు వచ్చిందో లేదో.. అలా వైరల్ అయిపోయింది. అయితే.. దీన్ని సీరియస్‌గా తీసుకున్న వాళ్ల కన్నా….ట్రోల్ చేసిన వాళ్లే ఎక్కువ. ఆత్రం ఆగడం లేదన్న కామెంట్లతో… విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. వైసీపీ నేతలు మాత్రం.. వెనక్కి తగ్గడం లేదు.
బై బై బోర్డు ఆగిపోయింది..! ఇంకా చంద్రబాబు సీఎంగానే ఉన్నారే..!?
బహిరంగంగానూ.. ఈ విషయంలో… జగన్ ను సంతృప్తి పరచడానికి వెనుకాడటం లేదు. జగన్ ను సంతోష పెడతాయి కాబట్టి.. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. జగన్… తన ఎన్నికల కార్యక్షేత్రాన్ని హైదరాబాద్ నుంచే నడిపించారు. అందుకే…. ఆయన ఇంటికి ఓ బిల్ బోర్డ్ తగలించారు. దానికి బై బై బాబు అని… టైమర్ అమర్చారు. అందులో.. పోలింగ్ తేదీని పెట్టుకుని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి… సమయం ముగిసిపోయినట్లుగా.. ఆ బిల్ బోర్డ్ లో టైమింగ్ అమర్చారు. ఆ గడువు ముగియగానే.. సంతోషపడ్డారు. సంబరాలు చేసుకున్నారు. అయితే.. ఇప్పటికీ చంద్రబాబు సీఎంగానే ఉన్నారు. మే 23వరకూ ఉంటారు. ఆ తర్వాత ఫలితాలు అనుకూలంగా వస్తే కొనసాగుతారు. 2014 ఎన్నికల సమయంలోనూ..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇంతే హడావుడి చేశారు. ఎన్నికలు నిర్వహించడం కూడా వేస్ట్ అన్నట్లుగా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి తేదీని కూడా ఖరారు చేసుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి.. డీలా పడిపోయారు.
2014 నాటి పరిస్థితే రిపీట్ అవుతోందా….?
అప్పట్నుంచి జగన్మోహన్ రెడ్డి.. మరో ఏడాదిలో ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకునేవారు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి.. మరో ఏడాదిలో సీఎం అవుతానని ప్రకటించడంతో.. టీడీపీ నేతలు కూడా అనుమానపడ్డారు. ఓ సందర్భంలో.. గవర్నర్ తో భేటీ అయిన తర్వాత .. రాజ్‌భవన్ ముందు కూడా అవే విమర్శలు చేయడంతో.. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగించింది. దీంతో… ఐదేళ్ల పాటు … ఎన్నికల కోసం నిరీక్షణ తప్పలేదు.. ఇప్పుడు… ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ 2014 నాటి పరిస్థితినే తీసుకొస్తున్నారు. .ఇప్పటికే.. ఊహాలోకంలో జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా జీవించేస్తున్నాడని.. ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పించినా… హైప్‌ను మాత్రం..వైసీపీ నేతలు తగ్గించుకోవడం లేదు. అది ఎంతగా అంటే.. మే 23వ తేదీన 2014 రిపీట్ అయితే.. తట్టుకోవడం అంత తేలిక కాదు…