తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో తమ పట్టుపెంచుకునే ప్రయత్నంచేస్తోంది ఎం.ఐ.ఎం. ప్రస్తుత ఎన్నికల్లో మహారాష్ట్ర, బీహార్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉత్తరాదిలోని కీలక రాష్ట్రాల్లో ఖాతా తెరవాలని చూస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలకు మజ్లిస్ పోటీ పడటం ఇది మొదటిసారి. ఇంతకుముందు, 2014లో మహారాష్ట్రలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మొత్తంగా పాతికమందిని బరిలోకి దింపితే, ఇద్దరు అభ్యర్థులు గెలిచారు. అయితే, ఇదే ఊపుతో ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరెయ్యాలని ప్రయత్నించినా పెద్దగా ఫలించలేదు. దేశంలోనే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో పార్టీకి పునాదులు వెయ్యాలని భావిస్తూ.. 2017లో దాదాపు నలభై చోట్ల పోటీకి దిగారు. కానీ, ఖాతా తెరవలేకపోయారు.
తాజా లోక్ సభ ఎన్నికల్లో బీహార్, మహారాష్ట్రల నుంచి మజ్లిస్ పోటీ పడుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కనీసం రెండైనా సీట్లు దక్కించుకుంటే… ఆ తరువాత, పార్టీ విస్తరణకు కావాల్సిన పునాదులు వేసుకోవచ్చనే వ్యూహంతో అసద్ సోదరులు ఉన్నట్టు సమాచారం. నిజానికి, ఈ రాష్ట్రాలపై గత కొన్ని నెలలుగానే శ్రద్ధ పెట్టారనీ, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ప్రారంభించారని సమాచారం. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ ఎక్కువగా ఉంటే… అక్కడ తమ సత్తా చాటుకోవచ్చు అనేది అసదుద్దీన్ ఆలోచన. కనీసం మరో ఐదేళ్ల నాటికైనా దేశంలోని మెజారిటీ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా మజ్లిస్ ను తయారు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు.
అయితే, సమస్య ఏంటంటే… దేశవ్యాప్తంగా ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ కి కొంత అనుకూలంగా ఉంటూ వస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వచ్చేసరికి భాజపా కూడా ముస్లిం ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నించింది. కాంగ్రెస్ ను కాదని, మజ్లిస్ ను ముస్లింలు నమ్మే పరిస్థితి రావాలంటే చాలా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇంకోటి…. సొంతగడ్డపై పట్టు సాధించి సత్తా చాటే ప్రయత్నం వదిలేసి, ఇతర రాష్ట్రాలపై దృష్టిపెడుతుండటం కూడా సరైన వ్యూహం కాదు. తెలంగాణలో ఇప్పుడు తెరాసతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి, తాజా ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో పోటీ చెయ్యలేకపోయారు. ఇక, ఆంధ్రాకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి మద్దతు అన్నారు. దాంతో అక్కడ బరిలో నిలిచే ప్రయత్నమే చెయ్యలేదు. పార్టీని విస్తరించుకోవాలనుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాలపై ముందుగా శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడైతే పొత్తుల పేరుతో ఉన్న అవకాశాలను వదలుకున్నారు. ఇంకోటి, కేవలం ముస్లిం ఓటు బ్యాంకును మాత్రమే ఆకర్షించాలన్న వ్యూహంతో వెళ్లే కంటే… బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తామనే ఇమేజ్ తో ఇతర రాష్ట్రాలకు వెళ్తే కొంత ఉపయోగం ఉండొచ్చేమో.