రీమేక్ సినిమా అంటే… చాలా సౌలభ్యాలుంటాయి. సన్నివేశాల కోసం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కథ గురించి జుత్తు పీక్కోవాల్సిన పని లేదు. అవి రెండూ… రెడీమెడ్గా దొరికేస్తాయి. వీలైతే ట్యూన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకూ అన్నీ మక్కీకి మక్కీ దించేయొచ్చు. అంతెందుకు… అసలు దర్శకుడే లేకుండా సీడీని ముందెట్టుకుని సినిమా లాగించేయొచ్చు. కానీ `ఏబీసీడీ` సినిమాకి మాత్రం ఒకరు కాదు, ఇద్దరు కాదు… చాలామంది దర్శకులు మారారు.. మారుతున్నారు. కాకపోతే.. ఇదంతా తెర వెనుక.
ఏబీసీడీ సినిమాకి సంజీవ్‌రెడ్డి దర్శకుడు. ఆయన పేరుకి మాత్రమే అని… ఈ సినిమా కోసం ఎవరు పడితే వాళ్లు దర్శకత్వ ప్రతిభ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని వార్తలు జోరుగా వ్యాప్తిస్తున్నాయి. చిత్ర నిర్మాత మధుర శ్రీధర్‌లోనూ ఓ దర్శకుడు ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా కొన్ని సన్నివేశాలు తీసేశారు. హీరోగా నిలదొక్కుకోవడానికి అహర్నిశలూ కష్టపడుతున్న అల్లు శిరీష్ కూడా దర్శకత్వ ప్రతిభ బాగా చూపించాడని టాక్. ఓ కో డైరెక్టర్ అయితే.. ఏకంగా దర్శకుడిగా విజృంభించాడట. ఇవన్నీ చాలదన్నట్టు.. ఫైనల్ కాపీ చూసుకున్నాక కూడా కొన్ని మార్పులూ, చేర్పులూ అవసరమయ్యాయని భావించి… పవన్ సాదినేని అనే దర్శకుడ్ని తీసుకొచ్చి రీపేర్లు చేశారు. సావిత్రి, ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రాలకు దర్శకత్వం వహించింది పవనే. ఇలా తలోచేయ వేయడంతో.. ఈ సినిమాకి ఎంతమంది దర్శకులు? అనే ప్రశ్న మొదలైపోయింది. ఎవరికి తోచిన విధంగా వాళ్లు మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్లడంతో.. ఈ సినిమా గమనమే మారిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్. అది మంచికా.?? చెడుకా?? అన్నది ఫలితం వచ్చే వరకూ తెలీదు. కాకపోతే.. ఇప్పటికీ ఫైనల్ కాపీ పూర్తవలేదని, ప్యాచ్ వర్క్‌లు జరుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది.