అన్నాడీఎంకే పార్టీకి ఓటేస్తే ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేసినట్టే అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో ఆ పార్టీ ప్రముఖ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జల్లికట్టును నిషేధించి తమిళనాడు సంస్క్రుతిని మోడీ అవమానించారన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎంలపై రకరకాల అనుమానాలు వస్తున్నాయనీ, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నెమ్మదిగా ఈవీఎంల వాడకం తగ్గిపోయిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటే ఎందుకు వెనకాడుతున్నారన్నారు. దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఏపీలో ఎన్నికల్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఈవీఎంలు మొరాయించాయనీ, ఇది కుట్రలో భాగమే అన్నారు.
రాజ్యాంగ సంస్థలన్నింటినీ ఒక్కోటిగా మోడీ తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారనీ, దేశాన్ని చీకట్లోకి నెట్టారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోడీ ప్రతీసారీ గుజరాత్ మోడల్ అంటుంటారనీ, ఇంతకీ అక్కడేముందని అన్నారు. తమిళనాడు లాంటి రాష్ట్రంతో పోల్చి చూస్తే.. గుజరాత్ లో ఏముందని ప్రశ్నించారు. ఆయన వైఫల్యాలను ప్రశ్నిస్తే గిట్టదనీ, రఘురామ్ రాజన్ లాంటివాళ్లు ఆయన పాలనలో వైఫల్యాలను సరిదిద్దే ప్రయత్నం చేశారనీ, అందుకే అలాంటి వాళ్లంటే ఆయనకి పడదన్నారు. దేశంలో ఆర్.బి.ఐ., సీబీఐ వంటి సంస్థల్ని ఒక్కోటిగా నమ్మకం పోయేలా చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఈసీని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆయన చుట్టూ నేరస్థులను పెట్టుకున్నారనీ, కర్నాటకలో గాలి జనార్థన్, యడ్యూరప్ప, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారితో ఆయన కలిసి పనిచేస్తున్నారని అన్నారు.
ఆంధ్రాలో ఎన్నికలు పూర్తయిన వెంటనే.. కొద్దిరోజులైనా విశ్రాంతి లేకుండా పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఒకపక్క, ఏపీలో ఈసీ వ్యవహరించిన తీరుపై పోరాటం చేస్తూనే, ఇంకోపక్క ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్తున్నారు. అవకాశం దొరికిన ప్రతీచోటా మోడీ వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తొలివిడతలోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఏపీలో పూర్తి కావడంతో చంద్రబాబు నాయుడుకి కావాల్సినంత సమయం దొరికిందని చెప్పొచ్చు. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని, భాజపా వ్యతిరేక పార్టీలకు మద్దతుగా ఆయన వెళ్తున్నారు. ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రయత్నం చేస్తారని ముందుగా ఊహించి ఉంటే, బహుశా ఏపీలో ఎన్నికలు తొలివిడతలోనే జరిగేవి కాదేమో! పశ్చిమ బెంగాల్ లో మాదిరిగా ఒక్కో విడతకీ కొన్ని కొన్ని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పెట్టేవారేమో! ఏపీలో దాదాపు నెల రోజులపాటు ఎన్నికల వాతావరణమే ఉంచేవారేమో!