సోషల్ మీడియా వల్ల ఎంత మంచి ఉందో, అంతకంటే ఎక్కువ చెడే కనిపిస్తోంది. గాసిప్పుల పేరుతో ఉన్నవీ లేనివీ రాసేస్తున్నారు. దానివల్ల నటీనటుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వ్యక్తిగతంగానూ వాళ్లెంతో మానసిక వేదనకు గురవుతున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ పై కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లు అసత్యవార్తల్ని ప్రసారం చేస్తున్నాయి. దీనిపై పూనమ్ కౌర్ ఫైర్ అయ్యింది. ఇలాంటి ఛానళ్లపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. దాదాపు 500 యూ ట్యూబ్ ఛానళ్లను ప్రస్తావిస్తూ, వాటి పేర్లతో సహా.. ఫిర్యాదు చేసింది. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై వేధింపులకు పాల్పడిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.