ఆడియో ఫంక్షన్లలోనూ, సక్సెస్ మీట్లలోనూ హీరోల్ని పొగడ్డమే మిగిలినవారి పని. అయితే ఆ పొగడ్తలు అప్పుడప్పుడూ శృతిమించుతుంటాయి. చెప్పే ఉద్దేశ్యం ఒకటైతే – మరోటేదో బయటకు వచ్చి – ఆ మంచి ఉద్దేశ్యాన్ని కూడా పాడు చేస్తుంటుంది. పోసాని కృష్ణ మురళిలాంటివాళ్లు మైకు అందుకుంటే – అది ఇంకాస్త ఓవర్ డోసులో వినిపిస్తుంటుంది. పోసాని మాటలు అసలే నాటు కత్తిలా.. చుర చుర లాడిపోతుంటాయి. దానికితోడు పొగడ్తల కార్యక్రమంలో దిగితే.. మరింత విజృంభిస్తుంటుంది.
మజిలీ సినిమాలో పోసాని చక్కటి పాత్ర పోషించాడు. ఆ సినిమాకి సంబంధించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్యని పొగడాలని మైకు అందుకున్నాడు. `చైతన్య తొలి సినిమా జోష్ చూశా. అందులో బొమ్మలా ఉన్నాడు. మజిలీలో దానెమ్మలా ఉన్నాడు` అంటూ పంచ్ వేశాడు. పోసాని ఉద్దేశ్యం మంచిదే. పోలిక కూడా సూటబుల్. కానీ పదాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా? మాట్లాడింది పోసాని కాబట్టి, అతని స్టైల్ అదే కాబట్టి.. అక్కడున్నవాళ్లంతా నవ్వులతో సరిపెట్టేశారు.