130 నుంచి 150 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని, సైకిల్ జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కి ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కదనీ, మానసికంగా దానికి జగన్ సంసిద్ధంగా ఉండాలని ఉమ అన్నారు. ఇవాళ్ల లోటస్ పాండ్ లో దూకుడు సినిమాలో బ్రహ్మానందం రియాలిటీ షో లాంటిది నడుస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం సారు అని పిలిస్తే తప్ప జగన్ సారు పలకడం లేదన్నారు! కొద్దిరోజుల్లో ఈ పిచ్చి పరాకాష్టకి చేరి… ఉమారెడ్డి గవర్నర్ అయిపోతారనీ, లోటస్ పాండ్ లోనే జగన్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేయడానికి విజయసాయిరెడ్డి సిద్ధపడేట్టుగా ఉన్నారన్నారు. ఈ పిచ్చితోనే తమపై దాడులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారని దేవినేని ఉమా అన్నారు.
టీడీపీకి అనుకూలంగా ఉన్న బూతుల్లో పోలింగ్ ఆలస్యం చేస్తే ఓటర్లు వెనక్కి వెళ్లిపోతారని అనుకుని కుట్ర చేశారన్నారు. కానీ, ఏడు గంటలు ఆలస్యమైనా, రాత్రి పన్నెండు గంటలైనా ప్రజలు లైన్లలో నిలబడి ఓట్లేస్తారని బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అంచనా వెయ్యలేకపోయారనీ, లోటస్ పాండ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఊహించలేదన్నారు. మహాళా లోకం ఈ స్థాయిలో తిరగబడి ఓట్లేయడానికి వస్తారనిగానీ, ఇంత పెద్ద ఎత్తున క్యూలైన్లలో గంటలకొద్దీ నిలబడి ఓట్లేస్తారని వాళ్లు అనుకోలేదన్నారు. ఓటింగ్ శాతం 50 కి మించకుండా ఉండేందుకు వీళ్లెంత ప్రయత్నించినా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు ఓటరు మహాశయులు కదిలి వచ్చారన్నారు. గొల్లపూడిలో తాను ఓటెయ్యడానికి వెళ్తే ఈవీఎంలు మొరాయించాయనీ, అదే విషయం మీడియాతో మాట్లాడుతుంటే వైకాపావాళ్లు గొడవ చేయడానికి వచ్చేశారన్నారు. తనను గొడవలోకి లాగి, మంత్రి గొడవతో పోలింగ్ ఆగిపోయిందనే భయాన్ని ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేశారని దేవినేని చెప్పారు. కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్, ఎ-2 అయిన విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యుడిని చేసి, ప్రధాని కార్యాలయంలో పెట్టించారన్నారు. ఈసీకి ఫిర్యాదులు ఇచ్చి నిజాయితీగా పనిచేసే అధికారులపై బురద చల్లించారన్నారు.
ఒకటైతే వాస్తవం… ముఖ్యమంత్రి పదవిపై జగన్మోహన్ రెడ్డి చాలా కలలు కన్నారన్నది, ఆయన ప్రచార సరళిని ఒక్కసారి గుర్తుచేసుకుంటే అర్థమౌతుంది. అన్నని ముఖ్యమంత్రి చేసుకుందాం, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి కావాలని దీవించిండీ… ఇవే ఎక్కువగా వినబడతాయి. ఆ మాటలు ఆయనే చెప్పేసుకోవడం మరీ విడ్డూరం! తనని ముఖ్యమంత్రి చేయాలనే వ్యక్తిగత లక్ష్యాన్నే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, కష్టాలు, భవిష్యత్తు… వీటన్నింటికీ మించి తాను సీఎం కావడమే ముఖ్యమనే అభిప్రాయాన్నే జగన్ ప్రచారం చేశారు. ఆయనలో పదవీకాంక్ష చాలా తీవ్రంగా ఉందనేది వైకాపావారు కూడా కాదలేని వాస్తవం.