ఒకప్పుడు కాంగ్రెస్లో సీనియర్ నేత గా ఉండి, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరిన హరిరామజోగయ్య, 2019 ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. బెట్టింగ్ పందాలు కాచుకునే వాళ్ళు ఈ విషయాన్ని గమనించి కాస్త జాగ్రత్తగా మసలుకోవాలని అంటున్నారు.
175 స్థానాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 88 స్థానాలు గెలుచుకుంటే ఏ పార్టీకైనా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ పసుపు కుంకుమ పథకం తమకు ఓట్లు రాలుస్తుందని ధీమాతో ఉంటే ఇప్పుడు హరిరామజోగయ్య మాత్రం, పీకే ( పసుపు కుంకుమ) వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే అదనపు ఓట్ల కంటే, పీకే ( పవన్ కళ్యాణ్) వల్ల తెలుగుదేశం పార్టీ కోల్పోయే ఓట్లు అధికంగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు. అయితే అదే సమయంలో ఏ పార్టీ కూడా 90 స్థానాలు గెలుచుకునే పరిస్థితి లేదని హరిరామజోగయ్య అన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని హరిరామజోగయ్య చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తర్వాత జనాలు ఆయన ని పట్టించుకోవడం మానేశారు కానీ ఒకప్పుడు ఇదే హరిరామజోగయ్య పంపే విశ్లేషణలు , అంచనాల మీద కాంగ్రెస్ హైకమాండ్కు మంచి గురి ఉండేది. రాజకీయ విశ్లేషణలు చేయడంలోనూ రాజకీయ అంచనాలు వేయడంలోనూ ఆయనది అప్పట్లో అందెవేసిన చెయ్యి. మరి ఇప్పుడు హరిరామజోగయ్య చెబుతున్న విశ్లేషణలు ఎంతవరకు నిజం అవుతాయన్నది మే 23 తర్వాత తెలుస్తుంది