సాధారణంగా ఎన్నికల వరకు రాజకీయ నాయకులు అనేక విన్యాసాలు చేస్తూ ఉంటారు. అలవి మాలిన హామీలు ఇస్తూ ఉంటారు. ఒకసారి ఎన్నికలు అయిపోయాక, ఇక ప్రజలతో మాకేం పని అన్నట్టు గా వ్యవహరిస్తుంటారు. మళ్లీ ఎన్నికలు వచ్చేదాకా ప్రజల ముఖం కూడా తిరిగి చూడని నాయకులు చాలామంది ఉన్నారు. అయితే ఇటువంటి పార్టీల మధ్య జనసేన నేతలు మాత్రం కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, ప్రజలకు తాము ఇచ్చిన హామీల నెరవేరుస్తూ, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వారు చూపిస్తున్న చిత్తశుద్ధి ప్రజలను ఆకట్టుకుంటోంది.
మొన్నటికి మొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, విశాఖపట్నం నియోజకవర్గంలో జాతీయ రహదారుల విస్తరణ పనులను పర్యవేక్షించడమే కాకుండా, స్థానికులతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకున్నారు. విశాఖపట్నం నుండి ఎంపీగా పోటీ చేసిన ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల సమస్యలు తీర్చడానికి తాను ప్రయత్నిస్తానని ఆయన అంటున్నారు.
ఇక పుంగనూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్ కూడా ఇదే బాటలో పయనించారు. ఎన్నికల అయిపోయిన వెంటనే రైల్వే బోర్డు అధికారులను కలిసి, కొత్త రైల్వేలైన్ కోసం విజ్ఞప్తి పెట్టుకున్నారు. దీనికి రైల్వే అధికారుల నుండి కూడా సానుకూల స్పందన వచ్చింది.
ఇప్పుడు కళ్యాణదుర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధి కరణం రాహుల్ కూడా తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఎన్నికల సమయంలో తాగునీటి సమస్య గురించి నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తీసుకొని రాగా, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ఎన్నిక కాగానే తన సొంత డబ్బుతో బోరు బావి వేస్తానని ఆయన ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పిన మాట మేరకు, తన సొంత ఖర్చులతో బోరు బావి వేయించి తన మాట నిలబెట్టుకున్నారు.
ఏది ఏమైనా గెలిచిన తర్వాత కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సొంత వ్యాపారాలు చేసుకునే రాజకీయ నాయకుల మధ్య, తమ సొంత ఖర్చులతోప్రజా అవసరాలు తీరుస్తూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జనసేన నాయకులు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారని చెప్పవచ్చు.