తెలుగుదేశం పార్టీ తరఫున తోట త్రిమూర్తులు ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో జనసేన కార్యకర్త అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు తన మీద దాడి చేయడమే కాకుండా వేధింపులకు గురి చేస్తున్నారంటూ జనసేన కార్యకర్తలు, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి, ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే, ద్రాక్షారామం ప్రాంతానికి చెందిన రామకృష్ణ జనసేన పార్టీ తరఫున చురుగ్గా పనిచేశారు. పోలింగ్ రోజున తన నూడిల్స్ షాప్ మూసివేసి తాను తిరిగి వెళుతున్న సమయంలో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు కి చెందిన వ్యక్తులు రామకృష్ణ మీద దాడి చేశారని, నీ దిక్కున్న చోట చెప్పుకో అని అన్నారని, నువ్వే కాదు నీతో పాటు ఉన్న 30 మంది ని కూడా చంపేస్తామని బెదిరించారని రామకృష్ణ అంటున్నాడు. తోట త్రిమూర్తులు అనుచరుల వేధింపులు తట్టుకోలేక విపరీతమైన ఒత్తిడి లో చనిపోవాలని నిర్ణయించుకున్నానని, అయితే స్నేహితుడు కాపాడడంతో తిరిగి వచ్చానని రామకృష్ణ అన్నారు. తనని , తనతో పాటు ఉన్న మరొక 30 మంది జనసేన కార్యకర్తలను తోట త్రిమూర్తులు బెదిరిస్తున్నాడని, తమ వారికి రక్షణ కల్పించాలి అని జన సేన కార్యకర్తలతోపాటు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పోలిశెట్టి శ్రీనివాస్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఏది ఏమైనా, రామచంద్రపురం లో తోట త్రిమూర్తులు ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని జనసేన కార్యకర్తలు అంటున్నారు. మరి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుతో నైనా ఈ గొడవలు సద్దుమణుగుతాయా అన్నది వేచి చూడాలి.