ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత అవకతవకలన్నీ బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు ఈవీఎంల మొరాయింపు వ్యవహారంపై… తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. ఉదయం సమయంలో.. కొన్ని వేల ఈవీఎంలు మొరాయించాయి. వాటిని ఎవరు రిపేర్ చేశారన్నదానిపై.. ఇంత వరకూ… క్లారిటీ లేదు. కానీ.. ఈవీఎంల సమస్యలు వస్తే… పరిష్కరించడానికి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున.. ఈవీఎంలు తయారు చేసిన బీహెచ్ఈఎల్ ఇంజినీర్లను కేటాయించారు. కానీ… ఆ ఇంజినీర్లను.. ఎక్కడా ఉపయోగించుకోలేదన్న ప్రచారం జరుగుతోంది.
ఏపీలో మొత్తం ఆరు వందల మంది భెల్ ఇంజినీర్లు… పోలింగ్ రోజు విధులు నిర్వహించారని.. అయితే.. ఎంత మందితో… ఈవీఎంల సర్వీస్ చేయించుకున్నారో సమాచారం లేదు. ఈ విషయంపై సీఈవో ద్వివేదీ కలెక్టర్ల నుంచి వివరణ కోరారు. రాష్ట్రానికి 600మంది భెల్ నిపుణులు వచ్చినా… వారి సేవలు వాడలేదని… నివేదిక ఇవ్వాలని కోరారు. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్లను ద్వివేది ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో పెనుమలూరులో ఈవీఎంలను ఆర్వో ఆలస్యంగా అప్పగించడం, రాజాంలో మైనర్లు ఓటు వేసిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
మొత్తానికి వారం రోజులుగా.. పోలింగ్లో ఈవీఎం మెషిన్లు మొరాయించడం దగ్గర్నుంచి అనేక అంశాలపై టీడీపీ అధినేత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా.. ద్వివేదీ అవే అంశాలపై… కలెక్టర్ల నుంచి నివేదికలు కోరుతున్నారు. అయితే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం… ఈసీ పనితీరును భేష్ అంటున్నారు. ఈ పరిణామాలతో.. ఏపీలో జరిగిన పోలింగ్ తీరుపై… తీవ్రమైన అనుమానాలు రేకెత్తే పరిస్థితి ఏర్పడుతోంది.