నిన్న, వైకాపా నేత అంబటి రాంబాబుపై టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో… అంబటి తనకు పోటీ కాదనీ, ఆయన ఎప్పుడూ ప్రజల్లో లేరని, తనపై దాడి చేయించారంటూ కోడెల మాట్లాడిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా ఇవాళ్ల అంబటి రాంబాబు కూడా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు. కోడెల రాజకీయ జీవితమంతా నేర చరిత్రే అని ఆరోపించారు. ఆయన బూత్ క్యాప్చర్ చేసి, రిగ్గింగ్ కి ప్రయత్నిస్తే, స్థానిక ప్రజలు ఆయన అడ్డుకున్నారనీ, అంతే తప్ప ఆయనపై దాడి జరిగింది దాడి కాదని అంబటి చెప్పారు. ఎన్నికల రోజునే ఆయనపై ఫిర్యాదు చేస్తే… నిన్నటి వరకూ పోలీసులు ఎందుకు కేసు నమోదు చెయ్యాలేదని ప్రశ్నించారు. ఆయన వల్ల పదోన్నతులు వచ్చాయని భావిస్తూ వెనకేసుకొస్తే తరువాత శిక్షలు తప్పవన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు అంబటి. ఆంధ్రాలో ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ విఫలమైందని ఆయన అన్నారనీ, ఇలాంటి ఎన్నికల్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారనీ గుర్తుచేశారు. ఈవీఎంలు మొరాయించాయీ, ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందనీ ఆయన ఆరోపించారన్నారు. అయితే, ఎన్నికలు ఇంత లోపభూయిష్టంగా జరిగితే, ఈవీఎంలు ట్యాంపర్ అయితే, తనకు 150 సీట్లు ఎలా వస్తాయని చెబుతున్నారో ఆశ్చర్యంగా ఉందన్నారు! ఇంత అధ్వాన్నంగా ఎన్నికలు జరిగితే టీడీపీకి 150 వస్తాయా అని ప్రశ్నించారు? ఎన్నికలు లోపభూయిష్టంగా జరిగాయి కాబట్టి ఓడిపోతున్నాం అని చెబితే కొంత అర్థవంతంగా ఉంటుందనీ, 150 సీట్లు వస్తున్నప్పుడు ఇంతగా బెంబేలెత్తాల్సిన పనేముందన్నారు. అధికారం చేజారిపోతుందేమో అనే భయం కలిగినప్పుడు, ఆయన మనస్తత్వం బహుశా ఇలానే ఉంటుందేమో అంటూ అంబటి ఎద్దేవా చేశారు. ఇక, నారా లోకేష్ ట్వీట్ ను ప్రస్థావిస్తూ కూడా ఎవరో రాసి ఇచ్చింది ఆయన పోస్ట్ చేశారంటూ విమర్శించారు.
కోడెల తీరుపై ఎన్నికల రోజే ఫిర్యాదు చేస్తే… పోలీసులు పట్టించుకోలేదని అంబటి విమర్శించడం విచిత్రం! మరి, జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిసిన తరువాతే కేసు బుక్ చేయ్యడాన్ని కూడా వేరే కోణంలో చూడాలి కదా? లోపభూయిష్టంగా ఎన్నికలు జరిగితే, 150 సీట్లు వస్తాయని చంద్రబాబు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ, ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నదీ, చేస్తున్నదీ ఏంటనేది అంబటి పూర్తిగా అర్థం చేసుకున్నట్టు లేదు. పోలింగ్ కేంద్రాల్లో అలజడి సృష్టించడం ద్వారా టీడీపీ అనుకూల ఓటింగ్ శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేశారనీ, ఈవీఎంలను కావాలనే పనిచేయనీయకుండా చేశారని కదా ఆరోపణ. కానీ, వైకాపా వ్యూహం ఫలించలేదనీ, పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చి ఓటేశారనీ చంద్రబాబు అంటున్నారు. ఇంకోటి… ఈవీఎంల పనితీరు. దీనిపై వైకాపాకి ఏమాత్రం బాధ్యత లేదనేది మొదట్నుంచీ చూస్తున్నదే. ట్యాంపరింగ్ కి అవకాశం ఉందని సాంకేతికంగా నిరూపిస్తుంటే, ఇంకోపక్క దేశంలో 22 పార్టీలు దీనిపై పోరాటం చేస్తుంటే, ఇదేదో చంద్రబాబు ఒక్కరే చేస్తున్న హడావుడిగానో, ఓటమికి వెతుక్కున్న సాకుగానో చూస్తారేంటో? ఒక రాజకీయ పార్టీగా వారూ ఆలోచించాలి కదా.