వేలూరు డీఎంకే అభ్యర్థికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో పన్నెండు కోట్లను ఐటీ అధికారులు పట్టుకోవడంతో.. అదే సందనుకుని.. ఎన్నిక రద్దకు ఈసీ సిఫార్సు చేసేసింది. రద్దు చేసేశారు. పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిందన్న ప్రచారం కూడా చేశారు. కానీ అంతకు కొద్ది రోజుల ముందే.. అన్నాడీఎంకే మంత్రికి చెందిన ఇంట్లో 15 కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు పట్టుకున్నారు. కానీ సమాచారాన్ని బయటకు రానివ్వలేదు. అక్కడ పోలింగ్ కూడా జరగబోతోంది. అదే సమయంలో తెలంగాణలో పోలింగ్‌కు మూడు, నాలుగు రోజుల ముందు బీజేపీకి చెందిన ఎనిమిది కోట్లను పట్టుకున్నారు. అవి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పంచడానికని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ.. ఈసీ కనీసం వివరాలు సేకరించినట్లుగా సమాచారం బయటకు రాలేదు. హైదరాబాద్‌లో… కోట్లకు కోట్ల నగదు ..కట్టలు.. కట్టలు పట్టుబడింది. ఇలా పట్టుబడిన నగదు.. యాభై కోట్ల వరకూ ఉండొచ్చు. కానీ… ఎక్కడా పోలింగ్ రద్దు అనే ప్రస్తావన రాలేదు. ఇక ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో .. ఆర్టీసీ బస్సులో.. ఐదు కోట్లను తరలిస్తూ.. వైసీపీ అభ్యర్థి తమ్ముడు పట్టుబడ్డాడు. కానీ తనకు సంబంధం లేదని నోటిమాటగా చెప్పడంతో వదిలేశారు. అలాంటి కోట్లు… ఏపీ వ్యాప్తంగా అనేక చోట్ల పట్టుబడింది. అవన్నీ వైసీపీ నేతలే అని పక్కాగా తెలిసినా.. ఈసీ స్పందించలేదు. ఎక్కడా పోలింగ్ వాయిదా అనే మాట వరకూ రాలేదు. కానీ తమిళనాడులో మాత్రం పోలింగ్ రద్దు చేసేశారు..
అసలు ఇలా డబ్బు తరలింపుపై ఏకంగా మోడీపైనే ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలో ప్రచారానికి హెలికాఫ్టర్‌లో నరేంద్రమోడీ వెళ్లారు. ఆయన హెలికాఫ్టర్ నుంచి ఈ ట్రంక్ పెట్టెను అత్యంత రహస్యంగా… వేగంగా.. ఓ కారులో చేర్చారు. ఆ కారు వేగంగా వెళ్లిపోయింది. ఆ కారులో డ్రైవర్ తప్ప.. ఎవరూ లేరు. సినిమాల్లో సీన్‌ను తలపించేలా ఈ ఘటన ఉంది. కెమెరాల్లో రికార్డయింది. దీనిపై.. అనేక ఆరోపణలు వచ్చాయి. ఈసీకి అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ ఈసీ స్పందన నిల్. మోదీ హెలికాఫ్టర్ ను ఎందుకు సోదాలు చేయలేదని.. ఆ తరలించిన పెట్టెలో డబ్బులున్నయాని… కర్ణాటక రాజకీయ పార్టీలు ఘాటుగానే విమర్శలు గుప్పించాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా.. మోదీపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అయితే అవి భద్రతా పరికరాలు అంటూ…అనధికారింగా ప్రకటన వచ్చింది. అయితే.. ఇలా విమర్శించారనేమో కానీ… కుమారస్వామి హెలికాఫ్టర్లను సోదాలు చేయడం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కుమారస్వామి హెలికాఫ్టర్ ను ఐటీ అధికారులు చెక్ చేశారు. ఎంతగా అంటే..హెలికాఫ్టర్ లో ఉండే డోర్ మ్యాట్ కూడా.. ఎత్తి పరిశీలించారు.
నిజానికి కర్ణాటకలో.. ఇలాంటి సోదాలు… కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు అలవాటైపోయాయి. కుమారస్వామి కాన్వాయ్‌ని అయితే రెండురోజుల్లో పన్నెండు సార్లు చెక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బీజేపీ నేతలపై ఒక్కటంటే.. ఒక్క ఐటీ రెయిడ్ జరగలేదు. బాధితులంతా.. బీజేపీ వ్యతిరేకపార్టీల నేతలే తూత్తుకుడిలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కనిమొళి ఇంటిపై పోలింగ్‌కు రెండు రోజుల ముందు దాడి చేసి..సోదాలు చేశారు. కానీ అదే స్థానంలో గెలవడానికి కోట్లు వెదజల్లుతున్నారన్న ప్రచారం జరుగుతున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసై ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు కన్నెత్తి చూడలేదు. ఇలాంటివెన్నో.. ఇప్పుడు ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.