తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాటలతో టీడీపీ నేతలు జావకారిపోతున్నారు. పోలింగ్ మరుసటి రోజు నుంచే చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు, తన ఓటు తెలుగుదేశానికి పడిందా లేదా అని చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం కార్యకర్తలు, నేతల్లో నైరాశ్యం ఏర్పడింది. ఒకరకమైన గందరగోళానికి గురవుతున్నారు. చంద్రబాబు ఏ వ్యూహంతో మాట్లాడారో కాని.. ప్రజల్లోకి వేరే విధంగా వెళ్లింది. టీడీపీ నేతల్లో భయం ప్రారంభమయింది. దీనిపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్న చంద్రబాబు… పరిస్థితి తేడాగా ఉందని.. పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
తన పోరాటం అంతా వీవీప్యాట్లపైనేనని ఈవీఎంలపై కాదని.. చెబుతున్నారు. ఏపీలో తెలుగుదేశం విజయానికి ఢోకా లేదని, 120 నుంచి 130 సీట్ల మధ్య తెలుగుదేశానికి రాబోతున్నాయని వేవ్ ఎక్కువగా ఉంటే 150 సీట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని చంద్రబాబు నేతలకు చెబుతున్నారు. కేంద్రంలో మోడీ మళ్లీ రాకూడదని, ఏపీలో ఈవీఎంల్లోను, వీవీప్యాట్లలో జరిగిన సాంకేతిక లోపాలను ఎత్తిచూపి దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తే మిగతా రాష్ట్రాల్లో కూడా ఓటర్లంతా అప్రమత్తం అవుతారని, ఎన్డీయేతర పక్షాల అభ్యర్థులు కూడా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతోనే తాను ఈ ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లానని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు.
అయితే చంద్రబాబు ఆలోచలకు, తెలుగుదేశం తమ్ముళ్ల భావాలకు మధ్య లింకు కుదరడంలేదు. అధినేత ఒకటి ఆలోచిస్తుంటే ఆయన తమ్ముళ్లు మరొకటి ఆలోచిస్తున్నారు. ఇది ఇప్పుడు తెలుగుదేశంలో సందిగ్ధ వాతావరణానికి తెరలేచింది. క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి అనుకూలంగా మహిళలు, వృద్ధులు, తటస్థులు ఓటు వేశారని ఫీడ్ బ్యాక్ వస్తుంటే ఈవీఎంలపై చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలు తెలుగుదేశం కార్యకర్తలు, నేతలను డిఫెన్స్ లో పడేస్తున్నాయి.