రెండో దశ ఎన్నికలు ఇవాళ్ల జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంకా ఐదు దశల పోలింగ్ ఉంది. దీంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సభల్లో పాల్గొంటున్నారు. అయితే, ఐదేళ్లపాటు దేశం దశాదిశని మార్చేస్తానని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన మోడీ… ఈ ఎన్నికలకు వచ్చేసరికి గల్లీ స్థాయి నాయకుడిలా ప్రచారం చేసుకుంటున్నారు. గడచిన భాజపా పాలనలో సాధించిన విజయాల ప్రస్థావించడం లేదు. తాత్కాలికంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి, ఈ ఎన్నికలు గట్టేక్కేస్తే చాలు అన్నట్టుగా ఆయన తీరు మారిపోయింది. ఈ ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర్నుంచీ దేశభక్తిని ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ని భాజపా విజయంగా ప్రచారం చేశారు. ఈ దేశంలో తొలిసారి ఓటు వేయబోతున్న యువతరమంతా… వారి తొలి ఓటును సైన్యానికి వెయ్యాలని ప్రధాని పిలుపిచ్చారు. ఆయన దృష్టిలో సైన్యం అంటే భారతీయ జనతా పార్టీ..! ఈ ప్రచారమే అధ్వాన్నం అనుకుంటే… తాజాగా మరో మెట్టు దిగజారి కులాల గురించి కూడా మాట్లాడుతున్నారు ఈ దేశ ప్రధానమంత్రి!
మహారాష్ట్రలోని అక్లుజ్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ… ఒక బీసీ సామాజిక వర్గంపై బురద చల్లే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారని విమర్శించారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ… ఇలా మోడీలంతా దొంగలని కాంగ్రెస్, విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. మా బీసీ కులాలను తిట్టడంలో ఈ పార్టీలో పోటీపడుతున్నాయన్నారు. కులాలను నేపథ్యంగా చేసుకుని తనని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారని విమర్శించారు. మొదట తనని చౌకీదార్ చోర్ హై అన్నారనీ, ఇప్పుడు ఒక బీసీ కులాన్ని దూషిస్తున్నారని మోడీ వ్యాఖ్యానించారు. బీసీల నుంచి వచ్చిన తనకు అవమానాలు అలవాటేననీ, తననేమన్నా సహిస్తానుగానీ బీసీలను దూషిస్తే ఊరుకోనని హెచ్చరించారు.
ఇదీ దేశ ప్రధానమంత్రి చేసిన ఎన్నికల ప్రచార ప్రసంగం..! 2014 ఎన్నికల నాటి మోడీని గుర్తు చేసుకుని, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న మోడీని చూస్తుంటే… ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయారూ అనే ఆవేదన కలుగుతోంది. దేశ సమగ్రతను కాపాడాల్సిన ప్రధానమంత్రే ఇలా దిగజారిపోయి, కులాల పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడం చేసుకోవడం దారుణం. దీనికంటే, దేశభక్తి పేరుతో రాజకీయ లబ్ధికి ప్రయత్నించడం కొంత నయం. అలాగని దాన్నీ సమర్థించడం లేదుగానీ… దాని వల్ల కులాల కుంపట్లేవీ రాజుకోవు! మోడీ స్థాయికి… కాదు కాదు, మోడీ అంటే పైస్థాయి అనుకుంటూ ఆయన్ని గొప్పగా చూసేవారికి ఈ తరహా వ్యాఖ్యలు దిగజారుడుతనంగా కనిపిస్తాయి.