ఈ ఎన్నికలలో `పార్ట్ టైమ్ పొలిటీషన్`గా అవతారం ఎత్తిన సినిమా వాళ్లలో ఫృథ్వీ ఒకడు. వైకాపా జెండాని మోసి.. మోసీ.. ఆ పార్టీ కోసం ప్రచారం చేశాడు. మీడియా ముందుకొచ్చి… ఇతర పార్టీలపై, నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. కొన్నిసార్లు పవన్ కల్యాణ్నీ టార్గెట్ చేశాడు. ఎన్నికల అయిపోయినా… ఇంకా ఆ`పాత్ర`లోనే ఉండిపోయాడు ఫృథ్వీ. తన కామెంట్లలో జోష్ ఇంకా తగ్గలేదు. తాజాగా పవన్ కల్యాణ్ రాజకీయ భవితవ్యంపై జోస్యం కూడా చెప్పాడు.
పవన్ భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రెండు చోట్లా పవన్ గెలుస్తాడన్నది అభిమానుల నమ్మకం. అయితే ఫృథ్వీ మాత్రం ఆ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశాడు. గాజువాకలో పవన్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పాడు. అక్కడి రాజకీయం పూర్తిగా వైకాపా పార్టీవైపే ఉందని, అక్కడ వైకాపా అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటున్నాడు. భీమవరం ఊసుమాత్రం ఎత్తలేదు. నిజానికి భీమవరంలో వైకాపా నుంచి కూడా పవన్ కి గట్టి పోటీ ఎదురవుతోంది. మరి ఈ కమిడియన్ జోస్యం నెరవేరుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.