బుధవారం ఉదయం మధ్యాహ్నం కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి హెలికాప్టర్‌ను చెక్ చేశారనే వార్త హైలెట్ అయింది. కుమారస్వామిని హెలిప్యాడ్ మీద నిలబెట్టేసి.. అధికారులు హెలికాఫ్టర్‌లో ఉన్న బ్యాగులు సహా మొత్తం పరిశీలించి పంపేశారు. కొన్ని విమర్శలు వచ్చినా.. ఆ అధికారులను అందరూ అభినందించారు. సాయంత్రానికి.. ఒడిషా సీఎంకి కూడా.. అదే తరహా ట్రీట్ మెంట్ ఇచ్చారని తెలిసి.. ఈసీ బాగా పని చేస్తోందేమో.. అని జనం అనుకున్నారు. కానీ.. కాసేపట్లో… హెలికాఫ్టర్ చెక్ చేసిన అధికారులను ఈసీ సస్పెండ్ చేసిందనే వార్త బయటకు వచ్చే సరికి ఆశ్చర్యపోయారు. నిజానికి అలా సస్పెండ్ అయింది… కుమారస్వామి, నవీన్ పట్నాయక్ హెలికాఫ్టర్లు చెక్ చేసిన వారు కాదు. మోడీ చాపర్‌ను.. చెక్ చేసిన అధికారి.
ఒడిషాలో.. ఎన్నికల ప్రచారానికి వెళ్లారు మోడీ. అక్కడ ఓ అధికారి.. మోడీ చాపర్‌లో సోదాలు చేశారు. కాసేపటికే.. ఆ అధికారికి ఊస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. ఈసీ ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుంది. ఎందుకంటే.. ఎస్పీజీ భద్రత ఉన్న వారి హెలికాఫ్టర్లలో సోదాలు చేయకూడదట. ఎన్నికల నియామవళి అందరికీ ఒకటే ఉందికానీ… ఎస్పీజీ భద్రత ఉన్న వారికి వేరుగా ఉందని.. ఈసీ చెప్పే వరకూ చాలా మందికి తెలియదు. ఈసీ ఏది చెబితే అదే ఎన్నికల నియామవళి అనుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి… ఎవరూ నోరు మెదపడానికి అవకాశం లేదు.
నిజానికి పది రోజుల క్రితం.. కర్ణాటకలో ప్రచారానికి హెలికాఫ్టర్‌లో నరేంద్రమోడీ వెళ్లారు. ఆయన హెలికాఫ్టర్ నుంచి ఈ ట్రంక్ పెట్టెను అత్యంత రహస్యంగా… వేగంగా.. ఓ కారులో చేర్చారు. ఆ కారు వేగంగా వెళ్లిపోయింది. ఆ కారులో డ్రైవర్ తప్ప.. ఎవరూ లేరు. సినిమాల్లో సీన్‌ను తలపించేలా ఈ ఘటన ఉంది. కెమెరాల్లో రికార్డయింది. దీనిపై.. అనేక ఆరోపణలు వచ్చాయి. ఈసీకి అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ ఈసీ స్పందన నిల్. మోదీ హెలికాఫ్టర్ ను ఎందుకు సోదాలు చేయలేదని.. ఆ తరలించిన పెట్టెలో డబ్బులున్నయాని… రాజకీయ పార్టీలు ఘాటుగానే విమర్శలు గుప్పించాయి. దానికి ప్రతిగా.. విపక్ష నేతలు పర్యటిస్తున్న హెలికాఫ్టర్లలో సోదాలు చేస్తున్నారు. మోడీకి మాత్రం మినహాయింపునిచ్చారు.