భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై.. శక్తి భార్గవ అనే వైద్యుడు.. షూతో దాడి చేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో… మీడియాతో మాట్లాడుతున్న సమయంలో… జీవీఎల్ వైపు ఒక్క సారిగా షూ దూసుకు వచ్చింది. లిప్తపాటు కాలంలో.. అది ఆయన ముఖాన్ని రాసుకుంటూ… పక్కకు పడిపోయింది. లేకపోతే నేరుగా.. మొహానికి తగిలి ఉండేది. షూ విసిరిన శక్తిభార్గవను.. బీజేపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆయన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. శక్తిభార్గవ .. వైద్య వృత్తిలో ఉన్నారు. జీవీఎల్ నరసింహారావు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
శక్తిభార్గవ బీజేపీకి చెందిన వ్యక్తిగానే ఆయన సోషల్ మీడియా పోస్టుల ద్వారా గుర్తించారు. అయితే.. ఆయన బీజేపీలో తాజా పరిణామాల్ని మాత్రం వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అద్వానీకి బాగా అభిమానించే శక్తిభార్గవ… ఆయనకు… ప్రస్తుతం పార్టీలో అవమానాలు ఎదురవుతూండటంపై పలు సోషల్ మీడియా పోస్టుల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతోనే… జీవీఎల్ నరిసంహారావుపై.. ఆయన దాడి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాన్పూర్లో వైద్యునిగా శక్తిబార్గవకు మంచి గుర్తింపు ఉందని చెబుతున్నారు. షూ విసిరిన సమయంలో.. జీవీఎల్ నరసింహారావు… మధ్యప్రదేశ్లోని భోపాల్లో… మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు అయిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ కు టిక్కెట్ ఇవ్వడాన్ని సమర్థిస్తున్నారు. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు.
శక్తిభార్గవ చెప్పుతో దాడి చేయడంతో… జీవీఎల్ నరసింహారావు షాక్కు గురయ్యారు. వెంటనే తేరుకుని.. కాంగ్రెస్ పార్టీ పనేనని ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి చిల్లల దాడులకు పాల్పడితే బెదిరిపోయేది లేదని హెచ్చరించారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే బీజేపీ ఆఫీసులోకి.. మీడియా సిబ్బందిని కూడా.. పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే పంపిస్తారు. బీజేపీ నేతగా శక్తిభార్గవకు ఉన్న గుర్తింపు ద్వారానే ఆయన నేరుగా..బీజేపీ ఆఫీసులోకి ప్రవేశించగలిగారని అంచనా వేస్తున్నారు. మొత్తానికి షూ ఘటన జీవీఎల్ నరిసింహారావును మాత్రమే కాదు.. బీజేపీని కూడా షాక్ర కు గురి చేసింది.