ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా 22 రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై సుప్రీం కోర్టులో కేసు కూడా వేశాయి. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి 50 శాతం వీవీప్యాట్లను తప్పనిసరిగా లెక్కించాలంటూ రాజకీయ పార్టీలు పట్టుబడుతున్నాయి. ఈ పోరాటానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి సీఈసీని కలిసి ఈవీఎంలలో లోపాలను సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేశారు. ఇతర రాష్ట్రాలకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ, అక్కడ కూడా ఈవీఎంల పనితీరుపై మాట్లాడుతున్నారు. అయితే, 50 శాతం వీవీప్యాట్లను కచ్చితంగా లెక్కించాలనే అంశమై దేశవ్యాప్తంగా మరింతగా చర్చ జరగాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీ వేదికగా ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనే అంశమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పలువురు ఎంపీలు, పార్టీ నేతలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన 25 మందితో ఢిల్లీలో నిరసన కార్యక్రమం పెడితే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో జరుగుతున్నట్టు సమాచారం. ఇలా చేయడం ద్వారా జాతీయ స్థాయిలో దీనిపై పెద్ద ఎత్తున చర్చకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ఈ నెల 22న టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో జరగనున్న సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అభ్యర్థుల అభిప్రాయాలు తీసుకున్నాక, ఢిల్లీలో నిరసన కార్యక్రమంపై తుది నిర్ణయం చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. నిజానికి, ఇప్పటికే పలువురు నేతలతో కలిసి సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే.
గతవారంలో, జాతీయ పార్టీల నేతలతో ఓ సమావేశం కూడా నిర్వహించారు. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలన్న డిమాండ్ కు 22 పార్టీల మద్దతు ఉంది. అయితే, టీడీపీ నేతలు ప్రతిపాదిస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో ఇతర జాతీయ పార్టీలు కూడా కలుస్తాయా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే, దేశవ్యాప్తంగా వచ్చే నెల 19 వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఢిల్లీలో ధర్నా చేపడదామనుకున్నా… అక్కడ అనుమతుల సమస్య ఎదురయ్యే అవకాశమూ లేకపోలేదు. వీటన్నింటిపై 22న జరగనున్న టీడీపీ నేతల సమావేశం తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.