రాజధాని కోసం వాళ్లు 35 వేల ఎకరాలు త్యాగం చేశారు. సారవంతమైన భూములు.. అలా చంద్రబాబు అడగగానే ఇలా ఇచ్చేయడం.. అంత చిన్న విషయం కాదు. అందుకే.. అమరావతి భూసమీకరణ హైలెట్ అయింది. అయితే .. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు వారంతా.. టెన్షన్ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలవాలని వారు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజధానిపై పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉండటంతో… రాజధానిని మార్చకపోయినా.. అభివృద్ధి మాత్రం జరిగేందుకు అవకాశం లేదని రైతులు నమ్ముతున్నారు. టీడీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే ఎదురయ్యే పరిణామాలను ఊహించుకుంటేనే భయమేస్తోందని రైతులు వాపోతున్నారు. చెప్తున్నారు. అదే జరిగితే రాష్ట్రం కచ్చితంగా తిరోగమనంలో పయనిస్తుందని, ప్రధానంగా పోలవరం, అమరావతి తదితర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు పూర్తవడం సందేహాస్పదమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే ప్రగతిపథంలో పరుగు ప్రారంభించిన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే భావనలో ఉంటున్నారు. నిజానికి రాజధాని వచ్చిన తర్వాత అక్కడి ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. భూములున్న ప్రతి ఒక్కరూ కోటీశ్వరులైపోయారు. దానికి తగ్గట్లుగానే విలాసాలు వచ్చి చేరాయి. నంద్యాల, కాకినాడ, తెలంగాణ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కూడా కాశారు. కానీ ఈ సారి మాత్రం ఎవరూ బెట్టింగ్‌ల జోలికి వెళ్లడం లేదు. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్‌లు భారీగానే ఉంటాయి. విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత ఇక్కడి భూములు, ఇతర ఆస్తుల విలువ ఎన్నో రెట్లు పెరిగిపోవడంతో ఆయా గ్రామాల వారు కూడా బెట్టింగ్‌లకు సై అంటున్నారు. ఏపీ ఎన్నికలపైనా భారీగానే బెట్టింగ్‌లు సాగుతాయని ఊహించారంతా. కానీ.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ టీఆర్ఎస్ గెలిచింది. అందుకే వారు బెట్టింగ్‌ల జోలికి వెళ్లడం లేదు. అయితే టీడీపీ గెలుపు ఖాయమనే విషయంలో వారు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మహిళా ఓటర్లు, రైతన్నలు, పింఛన్‌దారులు రాత్రి పొద్దుపోయినా సరే ఓర్పుగా నిరీక్షించి ఓటు వేయడంతో ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమేనని భావిస్తున్నామని అంటున్నారు. అయితే ఆ తర్వాత పరిణామాలు వారిలోనూ సందేహాన్ని రేపాయి.