రంగా హత్యకేసుకు సంబంధించి జగన్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తీవ్ర ఆరోపణ చేయడం, దానికి ఆయన అంతే తీవ్రంగా సమాధానమివ్వడం రాజకీయ దుమారం రేపాయి. జగన్ జాగ్రత్త పాటించలేదని నేను నిన్ననే 360లో రాశాను. తర్వాత కోడెల కూడా అంతే తీవ్రంగా స్పందించారు. సామాన్యంగా స్పీకర్లు రాజకీయ వివాదాలపై స్పందించరు గనక ఇది చర్చనీయమైంది.
“స్పీకింగ్కు అవకాశం లేని పీఠాన్ని ఆలంకరించే వ్యక్తిని స్పీకర్ అని ఎందుకంటారో అర్థం కాదు” అని ఒకసారి కోడెలతో ఆంటే సరదాగా నవ్వేశారు. అయితే ఎవరు మాట్లాడాలన్నా అనుమతి ఇచ్చే అధికారం వుంటుంది. క్రియాశీల రాజకీయాల్లోనూ అందులోనూ..క్రిమినల్ వివాదాల్లోనూ కూడా ఢక్కాముక్కీలు తిన్న కోడెల వంటి వ్యక్తి రాజకీయాలు మాట్లాడకుండా స్పీకర్ స్థానంలో నిగ్రహంగా వుండటం పెద్ద సవాలే. అయితే చంద్రబాబు నాయుడు ఆయనను కేబినెట్లోకి తీసుకోకపోవడంతో, ఒక ప్రముఖ వ్యక్తి కూడా గట్టిగా చెప్పిన తర్వాత స్పీకర్ స్థానంలోకి తీసుకున్నట్టు చెబుతారు.
సభలో ఒక్కటే ప్రతిపక్షం వుండటం, దానికి ప్రభుత్వ పక్షానికీ మధ్యన నిరంతర ఘర్షణ వీటి మధ్య స్పీకర్ స్థానం పెద్ద ఉద్రిక్త పీఠంగా మారిపోయింది. అయితే కోడెల సీనియారిటీని బట్టి చూస్తే జగన్మోహన రెడ్డిని ప్రస్తావిస్తూ పదే పదే మాట్లాడ్డంలో కొంత సంయమనం చూపిస్తుంటారనే చెప్పాలి. తను అవకాశమిచ్చినప్పుడు జగన్ ఉపయోగించుకోలేకపోతున్నారని ఆయన అంటుంటారు. జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి వంటి వైసీపీ నేతలతో ఆయన మధ్య మధ్య మాట్లాడి సర్దుబాటు చేస్తుంటారు కూడా. ఏమైనా తెలుగుదేశం వైసీపీల మధ్య రోజువారి కుంపటి చల్లారే ప్రసక్తి లేదు గనక కోడెల కూడా అందుకు అనుగుణంగానే వ్యవహరించడంలో ఆశ్చర్యం లేదు.
ప్రస్తుతం వైసీపీ ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది కూడా. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు కోడెల ప్రతిస్పందన మరింత వివాదగ్రస్తమవుతున్నాయి. వీటి ప్రభావం సభలో ప్రతిబింబించకూడదని ఆశించాలి. గతంలో ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తీసుకునే అవకాశం తక్కువ. ఎందుకంటే ఆ సభతో పాటే ఆ నోటీసు కూడా వెనక్కుపోతుందని ఒక వివరణ ఇస్తున్నారు. కాకుండా దాన్ని చర్చకు చేపట్టేమాటయితే సమావేశాలలో మొదటే తీసుకోవచ్చు. నిర్ణయం కూడా సభాపతి తీసుకోవలసిందే.