వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ నేత విజయసాయిరెడ్డి. చదవుకున్న వ్యక్తే కానీ.. రాజకీయాల్లోకి వస్తే దిగజారిపోయినట్లుగా ఉండాలన్న సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్న ఆయన… తనకు వ్యతిరేకులైతే చాలు.. ఎలాంటి అసభ్య పదాలతో అయినా సరే ట్విట్టర్లో విమర్శలు గుప్పించేస్తూంటారు. అవే మాటలు బయట మాట్లాడటానికి కూడా ఏ మాత్రం సంకోచించరు. తాజాగా.. ఆయన జనసేన పార్టీ తరపున విశాఖ నుంచి పోటీ చేసిన… సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ చేసిన ప్రకటనపై.. ఆయన ఓ ట్వీట్ చేశారు. అందులోనూ అవాస్తవాలే.. తెలియక చెబుతారో.. నిజంగానే.. తెలిసి కూడా.. తెలియనట్లు నటిస్తారో కానీ.. అమాయకత్వాన్ని వలకబోస్తారు.
ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లలో.. జనసేన విజయం సాధిస్తుందని.. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని… వీవీ లక్ష్మినారాయణ ప్రకటించారు. అక్రమాస్తుల కేసుల విచారణ సమయంలో వీవీ లక్ష్మినారాయణపై పీకల మీద దాకా కోపం పెంచుకున్న విజయసాయిరెడ్డి.. ఈ అవకాశాన్ని వదులుకోలేదు. అసలు జనసేన పార్టీ అరవై ఐదు స్థానాల్లోనే పోటీ చేసిందని.. తీర్మానించేసి.. 88 సీట్లలో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. అది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా అంటూ.. సెటైర్ వేశారు. కానీ.. అసలు.. విజయసాయిరెడ్డికి ఇలాంటి విషయాన్ని బ్రీఫింగ్ ఇచ్చే వారు లేరో.. తీసుకునే అలవాటు లేదో… కానీ… జనసేన పార్టీ.. 135 స్థానాల్లో పోటీ చేసింది. మిగిలిన స్థానాలను ఉభయకమ్యూనిస్టు పార్టీలకు, బీఎస్పీకి కేటాయించింది. ఆ మాత్రం కూడా తెలియకుండా… జనసేన పార్టీ 65 స్థానాల్లోనే పోటీ చేసిందని.. తనకు తాను ఊహించేసుకుని.. దాన్నే రాసుకొస్తున్నారు.
దొంగలెక్కలు రాయడంలో… విజయసాయిరెడ్డి పండిపోయారని.. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇరుక్కుపోవడానికి ఆయన కారమణనే విమర్శలు.. అటు బయట నుంచి బహిరంగంగా… వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు.. జనసేన పోటీ చేసిన స్థానాలను కూడా.. అలాగే.. విజసాయిరెడ్డి ఆడిటింగ్ చేశాడనే సెటైర్లు.. సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారమే… జనసేన పార్టీ… తన గుర్తు మీద 135 మంది అసెంబ్లీ అభ్యర్థులను రంగంలోకి దింపింది. అయినా.. సాయిరెడ్డి మాత్రం.. 65 చోట్లనే పోటీ చేశారని.. 88 ఎలా గెలుస్తారంటూ… అసలు దొంగ లెక్కల ఆడిటింగ్ తెలివి తేటల్ని చూపిస్తున్నారని.. జనసేన అభిమానులు.. సోషల్ మీడియాలో మండి పడుతున్నారు.