ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం రోజురోజుకీ దిగజారిపోతోంది. దేశభక్తి, మతం, కులం… ఈ ప్రస్థావన లేకుండా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న, తాను బీసీ కులస్థుడననీ, తనని రాహుల్ గాంధీ విమర్శిస్తే సహిస్తానుగానీ, బీసీలను ఏదైనా అంటే భరించలేనని కులం కార్డుని వాడేశారు. ఇక, భారత సైన్యాన్ని కూడా ఎన్నికల ప్రచారంలో ఎలా వాడుకుంటున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వ్యాపారస్థులను ఆకర్షించడం కోసం సాక్షాత్తూ జాతిపిత మహాత్మా గాంధీ పేరును వాడుకోవడం మొదలుపెట్టారు. నిజానికి, మోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో అత్యధికంగా దెబ్బతిన్నది చిన్నవ్యాపారులు. అనాలోచిత నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు చాలామంది చిన్నవ్యాపారుల జీవితాలను ప్రభావితం చేశాయి. అయితే, ఇప్పుడు వాళ్లందరినీ మళ్లీ ప్రసన్నం చేసుకోవాలి కదా! అందుకే, ఇప్పుడు వ్యాపారులపై ప్రేమ కురిపించేస్తున్నారు నరేంద్ర మోడీ!
వ్యాపారులందరూ దొంగలని కాంగ్రెస్ అంటోందని… ఆ పార్టీపై వ్యతిరేకతను పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గడచిన 70 ఏళ్లలో వ్యాపారులు ఎన్నో అవమానాలను భరించారని అన్నారు. అంటే, ఆత్మగౌరవ యాంగిల్ తెచ్చే ప్రయత్నం! దేశంలో ధరలు పెరగడానికి కారణం వ్యాపారులే అని కాంగ్రెస్ నాయకులు ఆరోపించేవారని చెప్పారు. ఢిల్లీలో వ్యాపారులతో జరిగిన ఓ సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి రాగానే చిన్న వ్యాపారులకు ఎలాంటి తనఖా లేకుండా రూ. 50 లక్షల వరకూ రుణాలను ఇస్తామన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ తాను వ్యాపార కులాని చెందినవాడననీ, బనియా కులస్థుడనని గర్వంగా చెప్పుకునేవారి మోడీ చెప్పారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులు వెన్నెముక అనీ, కానీ వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్నారు.
మహాత్మా గాంధీ కులాన్ని ప్రస్థావిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకోవడం దిగజారుడుతనంలో పరాకాష్ట. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులే వెన్నెముక అయితే… వారికి దక్కాల్సిన గౌరవం గత ఐదేళ్లుగా ఇవ్వనిది ఎవరు..? అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలవడానికి కారణం ఎవరు.? వ్యాపారులతో నిర్వహించిన ఈ సమావేశంలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు ప్రస్థావనను మోడీ ఎందుకు తేలేకపోయారు? చివరికి మహాత్మా గాంధీ మీ కులస్థుడనని గర్వంగా చెప్పుకునేవారని.. ఈ దేశ ప్రధాని మాట్లాడుతుంటే సగటు భారతీయుడికి ఆవేదన కలగకుండా ఎలా ఉంటుంది? ఆర్థిక వ్యవస్థను గత ఐదేళ్లలో ఎంత పటిష్టం చేశారో మోడీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆర్థిక విజయాలను వివరించి, వ్యాపారులను ఆకర్షించే ప్రయత్నం చెయ్యలేరా? ఇక్కడ కూడా కులం కావాలా?