తొలి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగియడంతో… అందరి దృష్టి ఇతర రాష్ట్రాలపై పడింది. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారశైలిపైనా పడింది. ఓ వైపు మిత్రపక్షాల కోసం.. చంద్రబాబు జోరుగా ప్రచారం చేసేస్తూంటే… కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. అందరూ.. కేసీఆర్ ఎందుకు అలా ఉన్నారన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కేసీఆర్… సైలెంట్‌గా ఉండొచ్చు కానీ.. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఇలా రాష్ట్రాల వెంట తిరిగి ప్రచారం చేయడం కన్నా… కొన్ని పార్టీలను.. తన కూటమిలోకి తెచ్చుకోవడం చాలా ముఖ్యమని ఆయన నమ్ముతున్నారు. దాని కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఏ రాజకీయ పార్టీకి అయినా.. సీట్ల సంఖ్య ముఖ్యం. సీట్లు ఉంటేనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. అందుకే… కేసీఆర్ ఇప్పుడు సీట్ల సమీకరణపై దృష్టి పెట్టారు. ఎన్నికలకు ప్రత్యేకంగా సాయం చేయడం ద్వారా ఆయా పార్టీలను.. తన ఫ్రంట్‌లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీతోనే ప్రారంభించారు. కేసీఆర్ టార్గెట్ 100 మంది ఎంపీలు అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి కలిసి వచ్చేది జగన్ ఒక్కరే..జగన్ కు కనీసంగా 18 నుండి 20 స్థానాలు వస్తాయని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు. తన పార్టీకి పదహారు వస్తే.. ఆ సంఖ్య 35 చేరుతుంది. అందుకే చిన్నా చితక పార్టీల వైపు దృష్టి సారించారట. ఎన్నికల్లో ఆ పార్టీలకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చుతామనే సందేశాన్ని పంపుతున్నారు. ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ తరపున ప్రత్యేక దూతలు కూడా వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది.
తనకు నమ్మకమైన ఏజెన్సీలను రంగంలోకి దింపి కొన్ని కీలక రాష్ట్రాల్లో సర్వే చేయిస్తున్నారని అంటున్నారు. సర్వేల ఆధారంగా వీలైతే ఇప్పుడే కొన్ని ఆఫర్లు ఇస్తున్నారని తెలంగాణ భవన్‌లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో అందరికీ నిధుల అవసరం ఉంటుంది. ఈ సమయంలో వాటిని సమకూర్చితే ఫలితాల తర్వాత కేసీఆర్ వెంట నడిచేందుకు మొగ్గుచూపుతారన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు బహిరంగంగా బీజేపీయేతర పక్షాల ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ.. కేసీఆర్ మాత్రం.. అంతర్గతంగా పని చేసేసుకుంటున్నారు. ఎవరిది పై చేయి అవుతుందో..?